జన్మదినం రోజే యువకుడి విషాదం.. | Sakshi
Sakshi News home page

జన్మదినం రోజే యువకుడి విషాదం..

Published Mon, Jan 15 2024 2:00 AM

- - Sakshi

మహబూబాబాద్‌ / వరంగల్‌: జన్మదినం రోజునే ఓ యువకుడు అనంతలోకాలకు చేరాడు. తన బర్త్‌డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన కమలాపూర్‌ మండలం కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వంగపల్లికి చెందిన నకీర్త శివ (20) కమలాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం శివ ఇంట్లో మల్లన్న పట్నాలు వేశారు. అదేరోజు శివ పుట్టిన రోజు కూడా కావడంతో స్నేహితులు సాయంత్రం ఫోన్‌ చేసి పిలిచారు.

దీంతో స్నేహితుల వద్దకు వెళ్లి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి అదేరోజు రాత్రి ద్విచక్రవాహనంపై వంగపల్లిలోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో కమలాపూర్‌లోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నడికూడ నుంచి కొత్తకొండకు వెళ్తున్న ట్రాక్టర్‌.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా అతడితో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కమలాపూర్‌కు చెందిన మరో యువకుడు అరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108లో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇవి చదవండి: ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు!

Advertisement
 
Advertisement
 
Advertisement