విజయకాంత్ మృతి పట్ల మోదీ, స్టాలిన్‌ ఏమన్నారంటే.. | Sakshi
Sakshi News home page

విజయకాంత్ మృతికి సంతాపం తెలిపిన మోదీ, స్టాలిన్‌.. నేడు థియేటర్స్‌ బంద్‌

Published Thu, Dec 28 2023 11:20 AM

Modi And MK Stalin Condoled The Death Of Vijayakanth - Sakshi

దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) వ్యవస్థాపకుడు విజయకాంత్‌ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సంతాపం తెలిపారు. స్టాలిన్‌ సంతాప సందేశంలో, 'మా ప్రియ మిత్రుడు - నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతితో పాటు ఎంతో బాధను కలిగించింది. మంచి మనసున్న మిత్రుడు విజయకాంత్ సినీ పరిశ్రమలోనూ, ప్రజా జీవితంలోనూ తన కఠోర శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు. నటుడిగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా.. ఏ పని చేపట్టినా దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదరించారు. కుటుంబ స్నేహితుడిగా నాకు సుపరిచితుడు. అని స్టాలిన్‌ తెలిపారు.


 
కొద్దిరోజుల నుంచి విజయకాంత్‌ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతుండగా ఈరోజు  (డిసెంబర్‌ 28) ఉదయం మృతి చెందాడు.     విజయ్ కాంత్ మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు. నేడు తమిళనాడు లోని అన్ని థియేటర్స్‌ను క్లోజ్‌ చేస్తున్నారు. అన్ని షో లు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కాంత్ నటించిన చివరి సినిమా మధుర విరన్ (2018)లో విడుదలైంది. ఆయన తమిళ చిత్రాల్లో మాత్రమే నటించడం విశేషం.

ప్రధాని నరేంద్ర మోదీ: విజయకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. విజయకాంత్‌ను తమిళ సినిమా లెజెండ్ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అతని నటన లక్షల మంది హృదయాలను తాకింది. ఆపై రాజకీయ నాయకుడిగా, అతను తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపారు. ప్రజా సేవలో ఉంటూ చాలా ఏళ్లుగా పోరాడారు.  అతని మరణం తమిళనాట రాజకీయాల్లో పూడ్చడం కష్టతరమైనది.' అని మోదీ తన ఎక్స్‌ పేజీలో పోస్ట్ చేశారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై: 'అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎండీకే అధినేత నా సోదరుడు కెప్టెన్‌ విజయకాంత్‌ మృతి చెందారని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేడు ఒక మంచి నటుడిని, మంచి రాజకీయ నేతను కోల్పోయాం. ఆయన నాకు మంచి సోదరుడు.' అని తమిళిసై తెలిపారు.

కమల్‌ హాసన్‌: నా సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విలక్షణ నటుడు విజయకాంత్ మరణవార్త ఎంతో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఆయన రానించారు.  సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. తమిళనాట ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఎన్టీఆర్‌: విజయకాంత్‌గారి మరణ వార్త ఎంతో బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయనొక  పవర్‌హౌస్‌. సినీ పరిశ్రమ ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.. 

చిరంజీవి:  మన ‘పురట్చి కలైంగర్’, ‘కెప్టెన్’ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయింది. అయనొక మంచి వ్యక్తిత్వంతో పాటు  తెలివైన రాజకీయ నాయకుడు. అయన ఎప్పుడూ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో నటించనప్పటికీ, ఇక్కడ కూడా ఆయనకు విపరీతమైన ప్రజాదరణతో పాటు ప్రేమను పొందాడు. మన ప్రియమైన ‘కెప్టెన్’ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని శూన్యాన్ని మిగిల్చాడు! ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. 

మంచు విష్ణు: విజయకాంత్‌ గారు లేరని వార్త జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన సినిమాలు చూస్తూనే నా బాల్యం అంతా గడిచింది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో గుర్తుండిపోతాయి. ఆయన ఎంతో అభిమానంతో మాట్లాడుతారు. రంగం ఏదైనా సరే ఆయన నిజమైన నాయకుడని  మంచు విష్ణు తెలిపారు.

సంతాపం తెలిపిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి
విజయకాంత్ మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సంతాపం తెలిపింది. తెలుగు చిత్రసీమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, టి. ప్రసన్న కుమార్ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం కుటుంబానికి అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని వారు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తూ ఒక లేఖను విడుదల చేశారు.

Advertisement
Advertisement