'రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఆమె చనిపోవాల్సింది.. కానీ'! | Sakshi
Sakshi News home page

SS Rajamouli: 'ఆర్ఆర్‌ఆర్‌లో ఆ సీన్ మొత్తం మార్చేశా.. ఎందుకంటే?: రాజమౌళి

Published Tue, Mar 19 2024 9:44 PM

SS Rajamouli Interesting Comments On Jenny Character In RRR - Sakshi

రామ్ చరణ్, ఎన్టీఆర్‌ నటించిన పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్‌ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో మరిన్నీ సీన్స్ ఉన్నాయని రాజమౌళి తెలిపారు.  కానీ సినిమా నిడివి పెరగడంతో ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు. 

రాజమౌళి మాట్లాడుతూ..'ఎన్టీఆర్‌(భీమ్)ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్‌) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కు సాయం చేయాలనుకుంటుంది. ఆమె అంకుల్‌ గవర్నర్‌ స్కాట్‌ గదిలోకి రహస్యంగా వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్‌ను దొంగిలించి భీమ్‌కు అందజేస్తుంది. అక్కడి నుంచి వస్తుండగానే.. స్కాట్‌ భార్య ఆమెను చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి ఉండటంతో అనుమానం వచ్చి.. విషయాన్ని స్కాట్‌కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్‌ తప్పించుకుంటాడు.' ‍ అని తెలిపారు. 

ఆ తర్వాత రామ్‌ను జైల్లో పెడతాడు స్కాట్. ఈ విషయం తెలుసుకున్న భీమ్‌ తిరిగి వచ్చి రామ్‌ను కాపాడి జైలు నుంచి బయటకు తెస్తాడు. వాళ్లిద్దరూ బ్రిటిష్‌ సైన్యాన్ని చంపుకుంటూ పోయే క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్‌ ప్లాన్. లొంగిపోకపోతే.. జెన్నీని చంపేస్తానని వాళ్లను స్కాట్ బెదిరిస్తాడు. దీంతో వారు లొంగిపోయే క్రమంలోనే జెన్నీ మోసం చేసిందన్న కోపంతో ఆమెను స్కాట్ చంపేస్తాడు. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్‌ వర్షన్‌లో జెన్నీ చనిపోతుంది. కానీ ఈ విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారంటూ' పేర్కొన్నారు.  

ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీని ప్రకారం భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్‌ రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సీన్స్ తొలగించారు.  కాగా. రాజమౌళి తన నెక్ట్స్‌ మూవీ ప్రిన్స్‌ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు.
 

Advertisement
Advertisement