అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసు.. సీపీ శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసు.. సీపీ శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published Mon, May 6 2024 1:30 PM

CP Srinivas Reddy Key Comments Over Amit Shah Morphing Video Case

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా సీపీ శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో సోషల్‌ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేశాం. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ట్విట్టర్‌కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు. ఏ అకౌంట్‌ నుంచి వీడియో అప్‌లోడ్‌ అయ్యిందో ట్విట్టర్‌ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీడియో మార్ఫింగ్‌ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు.

మార్ఫింగ్‌ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపించాము. ఫోరెన్సిక్‌ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము. మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం. ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్‌ క్రియేట్‌ అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కోసం ఫుల్‌ బందోబస్తు..
ఇదే సమయంలో ఎన్నికల బందోబస్తు గురించి కూడా వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, సీఏపీఎఫ్‌ నుంచి 13, సీఆర్‌పీఎఫ్‌ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతాం. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన దాని కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్‌కి వచ్చాయి. మరిన్ని బలగాలను పంపాలని కోరాం.

పోలింగ్‌ స్టేషన్స్‌, పోలింగ్‌ లోకేషన్స్‌ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీమ్స్‌ నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి నడుస్తున్నాయి. హైదరాబాద్‌ పోలీసుల నుంచి క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌ కూడా పని చేస్తున్నాయి. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్‌ ఉన్నాయి. పోలింగ్‌ రోజు ఈ టీమ్స్‌ పనిచేస్తాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుంచి 18 కోట్ల అక్రమ నగదుని ఇప్పటివరకు పట్టుకున్నాం. అలాగే, 12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement