చిరంజీవి సినిమాను రిజెక్ట్‌ చేసిన విజయశాంతి? | Sakshi
Sakshi News home page

చిరంజీవి సినిమాను రిజెక్ట్‌ చేసిన విజయశాంతి?

Published Thu, Apr 25 2024 3:09 PM

Vijayashanthi Rejects Chiranjeevi Latest Movie Vishwambhara

టాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ పెయిర్‌లో చిరంజీవి-విజయశాంతి జంట ఒకటి. స్వయంకృషి, అత్తకు యముడు అమ్మయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్.. ఇలా దాదాపు 19 సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. పలు సినిమాల్లోనూ పోటాపోటిగా అన్నట్లుగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం మెకానిక్‌ అల్లుడు(1994). ఇది బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హిట్‌ పెయిర్‌కి మళ్లీ కలిసి నటించే అవకాశం రాలేదు. ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో.. ఇండస్ట్రీకే గ్యాప్‌ ఇచ్చారు. చాలా ఏళ్లవరకు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు.

ఇద్దరి పార్టీలు వేరు వేరు కావడంతో అభిప్రాయ భేదాలు ఏర్పడి.. ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మాత్రం ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్టేజ్‌పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై ఓ క్రేజీ రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి నడిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’లో విజయశాంతి కీలక పాత్ర పోషించబోతుందని ఆ వార్త సారాంశం. 

జస్ట్‌ రూమరేనా?
విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని టీమ్‌ సంప్రదించిన మాట వాస్తమేనట. కానీ రాములమ్మ మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్‌కి జోడిగా నటించిన తాను.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పిందట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టొదని.. అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి చెప్పారట. 

విజయశాంతి నటించడం కష్టమే
విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ఆమెకు కూడా నటించాలనే ఇంట్రెస్ట్‌ లేదు. పాత్ర నచ్చడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. అదే సమయంలో మళ్లీ తాను తిరిగి సినిమాల్లో నటించనని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. పొలిటికల్‌గా మరింత ఎదగడానికి ఆమెకు ఇదే మంచి సమయం. ఇలాంటి టైంలో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Advertisement