గాంధీ వాడిన ఊతకర్ర కథ ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంది? | Sakshi
Sakshi News home page

Gandhi Iconic Lathi: గాంధీ వాడిన ఊతకర్ర కథ ఏమిటి?

Published Mon, Oct 9 2023 8:19 AM

How Mahatma Gandhi get his Famous Iconic Lathi - Sakshi

దండి మార్చ్‌కు ముందు.. ఆ తరువాత గాంధీ ఫోటోల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఊతకర్ర. గాంధీ 1930లో దండి మార్చ్‌తో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చేతిలో ఊతకర్ర చేరింది.ఇంతకీ ఈ ఊతకర్ర కథ ఏమిటి? దీనిని ఎవరు గాంధీకి ఇచ్చారు?

1930, మార్చి 12న తన 60 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. అప్పుడు గాంధీ సహచరుడు, స్నేహితుడు కాకా కలేల్కర్ మహాత్మునికి ఊతమిచ్చేందుకు ఒక కర్ర అవసరమని భావించారు. గాంధీ సాగించే అంత సుదీర్ఘ నడకలో ఆ కర్ర ఉపయోగకరంగా ఉండవచ్చనుకున్నారు. 

ఈ ఊతకర్రను తీసుకుని గాంధీ 24 రోజుల పాటు ప్రతిరోజూ పది మైళ్లు నడిచేవారు. ఈ నేపధ్యంలోనే ఆ ఊతకర్రకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గాంధీ తన జీవితంలో అనేక ఊతకర్రలను ఉపయోగించారు. అయితే ఆయన దండి మార్చ్‌లో ఉపయోగించిన ఊతకర్ర ఆ ఉద్యమానికి ప్రతీకగా మారింది. ఇది గాంధీ ఊతకర్రగా ప్రసిద్ధి చెందింది. 

ఈ కర్ర బలంగా ఉంటుంది. 54 అంగుళాల ఎత్తు కలిగిన వెదురు కర్ర ఇది. ఈ ప్రత్యేకమైన వెదురు కర్ణాటక తీర ప్రాంతంలోని మల్నాడులో మాత్రమే పెరుగుతుంది. 1948 జనవరి 30వ తేదీ వరకు అంటే గాంధీ హత్యకు గురయ్యే వరకు ఈ ఊతకర్ర గాంధీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఈ ఊతకర్ర న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న నేషనల్ గాంధీ మ్యూజియంలో ఉంది.
ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? 

Advertisement
Advertisement