పోస్టల్‌ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం

Published Mon, May 6 2024 4:10 AM

పోస్టల్‌ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం

విజయనగరం అర్బన్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ విజయనగరం గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఆదివారం సందర్శించారు. ఓటింగ్‌కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్‌ ప్రక్రియ, హెల్ప్‌ డెస్క్‌లు, క్యూలైన్లు, పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను, ఏర్పాట్లపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. జిల్లాలో పోస్టల్‌ ఓటింగ్‌, స్ట్రాంగ్‌రూమ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎన్‌.నాగలక్ష్మి వివరించారు. ఈ సందర్భంగా మీనా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ ఉద్యోగికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పోస్టల్‌ ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్‌, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు తీసుకెళ్లి ఓటు పొందవచ్చన్నారు. ఇలాంటి వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. వివిధ విభాగాల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, సీ–విజిల్‌ యాప్‌లో ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోని మద్యం అక్రమంగా రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 12,400 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్వో ఎస్‌.డి.అనిత, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి కె.సందీప్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ ఎ.కల్యాణ్‌చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సుధారాణి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఎ.రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్‌ బ్యాలెట్‌

సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా వ్యవస్థ

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

ముఖేష్‌కుమార్‌ మీనా

Advertisement
 
Advertisement