ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ ఇవాళ (మే 26) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్.. సన్‌రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో తొలి సీజన్‌లోనే టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్ల విషయం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది.
కేవలం ముగ్గురు మాత్రమే..
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకే కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచారు. తొట్ట తొలి సీజన్‌లో (2008) షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), 2013 సీజన్‌లో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), 2022 సీజన్‌లో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ప్రస్తుత సీజన్ ఫైనల్లో తలపడుతున్న పాట్ కమిన్స్ కూడా కెప్టెన్ ఇదే తొలి సీజన్ కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కెప్టెన్‌గా పాట్ ట్రాక్ రికార్డు చూస్తే వార్న్, రోహిత్, హార్దిక్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నేటి ఫైనల్లో కమిన్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కేవలం బ్యాటింగ్‌ను నమ్ముకున్న సన్‌రైజర్స్.. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న కేకేఆర్‌ను ఏమేరకు నిలువరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
అలా చూస్తే కేకేఆర్‌దే టైటిల్..
గత ఆరు సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుంది. ఈ సెంటిమెంట్‌నే కేకేఆర్ కొనసాగిస్తుందో లేక సన్‌రైజర్స్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో చూడాలి.
ఈ ఏడాది సన్‌రైజర్స్ మరో టైటిల్ గెలుస్తుందా..?
మరోవైపు సన్‌రైజర్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ కేకేఆరే అయినప్పటికీ.. కమిన్స్ కెప్టెన్సీ సామర్థ్యం, బ్యాటర్ల విధ్వంసంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు అంచనాలు నిజమైతే ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డు బుక్కుల్లోకెక్కుతాడు.
కేకేఆర్‌కు చెపాక్ స్పెషల్..
మరోవైపు చెపాక్ మైదానంతో కేకేఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడే తమ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కేకేఆర్ చెపాక్ సెంటిమెంట్ కూడా తమకు వర్కౌట్ అవుతుందని అశిస్తుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం తమనే వరించడంపై కూడా కేకేఆర్ ధీమాగా ఉంది. ఫైనల్లో మరోసారి ఎస్‌ఆర్‌హెచ్‌ను మట్టికరిపించి ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తామని కేకేఆర్ ధీమాగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment