సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉధృతంగా మారి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. అర్థరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఎఫెక్ట్‌తో కోల్‌కతాలో పలు విమానాలను రద్దయ్యాయి.
బెంగాల్‌లో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాల్లో 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్యం రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని.. రేపటి వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment