IPL 2024: రైజర్స్‌ VS రైడర్స్‌ | Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, road to IPL 2024 final | Sakshi
Sakshi News home page

IPL 2024: రైజర్స్‌ VS రైడర్స్‌

Published Sun, May 26 2024 5:46 AM | Last Updated on Sun, May 26 2024 5:57 AM

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, road to IPL 2024 final

నేడు ఐపీఎల్‌ ఫైనల్‌ 

కోల్‌కతాతో హైదరాబాద్‌ ఢీ 

సమరోత్సాహంతో ఇరు జట్లు  

రా.గం.7.30నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం

గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్‌ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్‌లు ఫైనల్‌ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్‌ అంచనాలు తిరగరాశాయి. 

అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్‌ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్‌కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా తమ మూడో టైటిల్‌పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్‌ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం.  

చెన్నై: ఐపీఎల్‌–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్‌ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతాయి. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్‌కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్‌తో పాటు అంతకు ముందు లీగ్‌ దశలో కూడా కేకేఆర్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ను ఓడించడంతో రైజర్స్‌ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది.  

మార్పులు చేస్తారా! 
ఫైనల్‌ కోసం హైదరాబాద్‌ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్‌–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్‌లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్‌ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్‌ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో దూకుడైన బ్యాటింగ్‌తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో  క్లాసెన్‌ మిడిలార్డర్‌లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్‌ రెడ్డి, సమద్‌లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. 

నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్‌రమ్‌ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఫిలిప్స్‌ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్‌ను బట్టి క్వాలిఫయర్‌లో షహబాజ్‌ను అనూహ్యంగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా చేసుకొచ్చి టీమ్‌ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్‌ను స్పిన్‌కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్‌లో నలుగురు లెఫ్టార్మ్‌ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ పేస్‌ బౌలింగ్‌లో తమ బాధ్యత నిర్వర్తించగలరు.  

మార్పుల్లేకుండా... 
కోల్‌కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్‌–1 ఆడిన టీమ్‌నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్‌ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్‌ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్‌ బౌలింగ్‌ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్‌ ఫామ్‌లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్‌ వరుణ్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. 
తుది జట్ల వివరాలు (అంచనా) 

సన్‌రైజర్స్‌: కమిన్స్‌ (కెపె్టన్‌), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్‌రమ్, క్లాసెన్, నితీశ్‌ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్‌/ మర్కండే.  
నైట్‌రైడర్స్‌: శ్రేయస్‌ (కెపె్టన్‌), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్‌.  

పిచ్, వాతావరణం 
రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్‌పై జరిగి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్‌ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్‌కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది.  శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్‌ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్‌ డే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement