న్యూఢిల్లీ: టి20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికాడు. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి అతను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది ఈ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లగా, అతని స్థానంలో బ్రావోను ఎంచుకున్నట్లు కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లతో కలిసి అతను పని చేస్తాడు. కేకేఆర్ టీమ్ యాజమాన్యానికి చెందిన ఇతర టి20 జట్లు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్, అబుదాబి నైట్‌రైడర్స్‌లకు కూడా ఇన్‌చార్జ్‌గా ఉండేలా ఈ గ్రూప్‌తో బ్రావో దీర్ఘకాలిక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు ముందు రోజే గురువారం తాను ఆటగాడిగా అన్ని స్థాయిల నుంచి రిటైర్ అవుతున్నట్లు బ్రావో ప్రకటించాడు.
ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బ్రావో 2011 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. మధ్యలో రెండేళ్లు చెన్నైపై నిషేధం ఉన్న సమయంలో అతను గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే తరఫున ఆడిన 10 సీజన్లలో 3 సార్లు టైటిల్ గెలిచిన జట్టులో అతను ఉన్నాడు. రిటైర్ అయ్యాక గత రెండు సీజన్లు చెన్నైకే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment