సూర్య కెప్టెన్‌గానూ సరైనోడే: గంభీర్‌ ఆరోజు ఏమన్నాడంటే! | When Gambhir Hailed Suryakumar Yadav As Leader Off The Field After KKR IPL 2015, See Details Inside | Sakshi
Sakshi News home page

సూర్య కెప్టెన్‌గానూ సరైనోడే.. కానీ: గంభీర్‌ ఆరోజు ఏమన్నాడంటే!

Published Thu, Jul 18 2024 5:20 PM | Last Updated on Thu, Jul 18 2024 7:03 PM

When Gambhir Hailed Suryakumar As Leader Off The Field After KKR IPL 2015

‘‘మేము అతడిని ఎల్లప్పుడూ నాయకుడి లక్షణాలున్న ఆటగాడిగానే పరిగణిస్తాం. అందుకు తగ్గట్లుగానే అతడిని తీర్చిదిద్దుతాం. కేకేఆర్‌కు, మిగతా ఫ్రాంఛైజీలకు ఉన్న తేడా ఇదే. అతడు వీలైనంత త్వరగా పరిణతి సాధించాలనే మేము కోరుకుంటున్నాం.

మైదానంలో మరింత చురుగ్గా కదులుతూ.. భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. వ్యక్తిగా, ఆటగాడిగా అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని కచ్చితంగా చెప్పగలను’’--

టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గురించి ప్రస్తుత హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ 2015లో అన్న మాటలివి. నాడు గౌతం గంభీర్‌ ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ హోదాలో ఉండగా.. సూర్య కూడా కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఈ క్రమంలో సూర్యను కేకేఆర్‌ వైస్‌ కెప్టెన్‌గా ప్రకటిస్తూ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలే ఇవి. అయితే, ఆ తర్వాత రెండేళ్లకు గంభీర్‌, సూర్య.. ఇద్దరూ కోల్‌కతా జట్టును వీడారు.

సూర్య ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోగా.. గంభీర్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌) పగ్గాలు చేపట్టాడు. అలా ఇద్దరి దారులు వేరయ్యాయి. సూర్య ముంబై జట్టుతో చేరిన తర్వాత వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్‌గా ఎదిగాడు.

అదొక్కటే చేయలేకపోయాను
టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అయ్యాడు. మరోవైపు.. ఢిల్లీ ఫ్రాంఛైజీతో పొసగకపోవడంతో గంభీర్‌ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు.

తాను కేకేఆర్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో సూర్య ప్రతిభను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయానని.. అదొక్కటే తన కెరీర్‌లో రిగ్రెట్‌గా మిగిలిపోయిందని గౌతీ ఓ సందర్భంలో చెప్పాడు.

కాలం గిర్రున తిరిగింది. తొమ్మిదేళ్ల తర్వాత గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా నియమితుడు కాగా.. సూర్య టీమిండియా టీ20 కెప్టెన్‌ రేసులో ముందుకు దూసుకువచ్చాడు.

సూర్యకే గంభీర్‌ ఓటు 
రోహిత్‌ శర్మ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో అతడు పోటీ పడుతున్నాడు. కెప్టెన్‌ నియామకం విషయంలో గంభీర్‌ అభిప్రాయం కూడా కీలకం కానుంది.

ఈ నేపథ్యంలో గతంలో సూర్యను ఉద్దేశించి గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. హార్దిక్‌ను కాదని.. సూర్య వైపే అతడు మొగ్గుచూపుతాడనే ప్రచారం నేపథ్యంలో ఈ కామెంట్స్‌ను ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు.

కాగా శ్రీలంకతో జూలై 27 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌తో కోచ్‌గా గంభీర్‌ ప్రస్థానం మొదలు కానుంది. ఈ సిరీస్‌ నుంచే సూర్య పూర్తిస్థాయి కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్‌.. ఇంకో 160 పరుగులు చేస్తే
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement