‘స్టార్’డమ్ నిలబడేనా!
కోల్‌కతా నైట్ రైడర్స్...
ఓనర్: షారుఖ్ (రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్), జూహీచావ్లా, జై మెహతా (మెహతా గ్రూప్)
కెప్టెన్: గౌతమ్ గంభీర్, కోచ్: ట్రెవర్ బేలిస్
గత ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (2012)
కీలక ఆటగాళ్లు: గంభీర్, యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్, కలిస్, షకీబ్ అల్ హసన్,
మోర్నీ మోర్కెల్
ఐపీఎల్‌లో తొలి సీజన్ నుంచి స్టార్ హోదా ఉన్న జట్టు కోల్‌కతా. షారుఖ్‌ఖాన్ దీని ఓనర్లలో ఒకరు కావడం వల్ల... తొలి సీజన్‌లోనే లాభాల బాటలో నడిచింది. అయితే ఆట పరంగా మాత్రం షారుఖ్ జట్టుకు ఐదేళ్ల వరకు నిరాశ తప్పలేదు. బాలీవుడ్ బాద్‌షా కలల జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ 2012లో టైటిల్ గెలిచింది. కానీ 2013లో ఘోరంగా విఫలమై ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో షారుఖ్ జట్టును మొత్తం మార్చాలని భావించారు.
కెప్టెన్ గౌతమ్ గంభీర్, మిస్టరీ స్పిన్నర్ నరైన్‌లను మాత్రం కొనసాగించి మిగిలిన అందరిని వదిలించుకున్నారు. తిరిగి వేలంలో ఆల్‌రౌండర్ కలిస్‌ను రూ. 5.5 కోట్లు పెట్టి కొన్నారు. రైట్ టు మ్యాచ్ కార్డ్ వాడి యూసుఫ్ పఠాన్‌నూ జట్టులోకి తెచ్చారు.
కలిస్, యూసుఫ్ పఠాన్‌లను వదిలేసి తిరిగి వేలం ద్వారా జట్టులోకి తీసుకోవడంతో చాలా డబ్బు ఆదా అయింది. ఇక రాబిన్ ఉతప్పకు రూ.5 కోట్లు పెట్టిన నైట్‌రైడర్స్... పీయూష్ చావ్లాను రూ.4.25 కోట్లకు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను చౌకగా రూ.2.8 కోట్లకు కొట్టేసింది.
బలాలు...
స్టార్ ప్లేయర్లతో షారుఖ్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ధాటిగా ఆడగల బ్యాట్స్‌మెన్... బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించే ఆల్‌రౌండర్లు.. ప్రత్యర్థిని కట్టడిచేసే స్పిన్నర్లకు ఏ మాత్రం కొదువ లేదు. భారత జట్టుకు ఆడిన బౌలర్లు వినయ్ కుమార్, ఉమేశ్ యాదవ్ జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం.
బలహీనతలు...
గౌతమ్ గంభీర్.. యూసుఫ్ పఠాన్.. రాబిన్ ఉతప్ప ధాటిగా ఆడగల భారత బ్యాట్స్‌మెన్.. అయితే వీళ్లు నిలకడగా ఆడతారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో వీళ్లు పెద్దగా రాణించిందేమీ లేదు. అలాగే లోయర్ మిడిల్ ఆర్డర్‌లో పరుగులు రాబట్టే బ్యాట్స్‌మెన్ జట్టులో లేక పోవడం పెద్దలోటు.
జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్లు: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, పీయూష్ చావ్లా, వినయ్ కుమార్, ఉమేశ్ యాదవ్.
విదేశీ క్రికెటర్లు: సునీల్ నరైన్, ఆండీ రస్సెల్ (వెస్టిండీస్), కలిస్, మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), క్రిస్ లిన్, ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), ర్యాన్ టెన్ డస్కాటే (నెదర్లాండ్స్)
భారత దేశవాళీ క్రికెటర్లు: మనీష్ పాండే, సూర్య కుమార్ యాదవ్, మన్వీందర్ బిస్లా, వీర్ ప్రతాప్ సింగ్, దేవవ్రతా దాస్, కుల్‌దీప్ యాదవ్, సయాన్ మోండల్.