'మా క్రికెటర్ల చేతిలోనే జట్టు భవితవ్యం'
కాన్పూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలపై ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ అనుమానం వ్యక్తం చేశాడు. తాము ప్లే ఆఫ్ కు చేరడానికి మిగిలి వున్న మ్యాచ్ ను గెలిచినా మిగతా జట్ల నుంచి తీవ్ర పోటీ ఉండటం ఖాయమని పేర్కొన్నాడు. గురువారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పై అసంతృప్తి వ్యక్తం చేసిన గంభీర్.. ఇక తమ జట్టు భవితవ్వం ఆటగాళ్ల చేతుల్లోనే ఉందంటూ అసహనం వ్యక్తం చేశాడు. గుజరాత్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి సాధారణ స్కోరుకే పరిమితం కావడం నిరుత్సాహ పరిచిందన్నాడు.
150-160 పరుగుల మధ్య స్కోరు చేయాల్సిన వికెట్ పై 124 పరుగులే చేసి విజయాన్ని ఆశించడం కష్టమన్నాడు. మంచి ప్రదర్శన ఇచ్చిన తరువాతే విజయాన్ని ఆశించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. నిన్నటి మ్యాచ్ లో తమ వ్యూహాలు పూర్తిగా బెడిసి కొట్టాయన్నాడు. ఇక తాము ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే జట్టు ప్రదర్శన కోసం నిరీక్షించుకుండా, ఆటగాళ్లు ఎవరికి వారే తమ సామర్థ్యాన్ని వెలికి తీయాల్సిన అవసరముందని గంభీర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.