
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు (Ind vs Eng)కు ముందు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలన్న ఈ స్పిన్ దిగ్గజం.. పరుగులు సాధించడం కంటే కూడా ఈ విషయం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించాడు. ఏదేమైనా.. ఐదో రోజు వరకు ఆటను పొడిగించాలని.. ప్రత్యర్థిని ఫీల్డింగ్‌లో అలసిపోయేలా చేయాలని పేర్కొన్నాడు.
అతడిని తీసుకోండి
ఇక తుదిజట్టులో పెద్దగా మార్పులు అక్కర్లేదన్న అశ్.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఓటమికి భయపడాల్సిన పనిలేదు. వెనువెంటనే జట్టులో మార్పులూ చేయకూడదు.
రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయగల సత్తా టీమిండియాకు ఉంది. అయితే, ఇంగ్లండ్ వ్యూహాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే సిరీస్ మన చేజారిపోవడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు.
ఒత్తిడి పెంచాలి
ఐదో రోజు వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. లేదంటే కథ ముగిసిపోతుంది. ఐదో రోజు ఎంత పెద్ద టార్గెట్ అయినా తాము ఛేదిస్తామని ఇంగ్లండ్ బహిరంగంగానే చెప్పింది. ఈ విషయాన్ని మన బ్యాటింగ్ లైనప్ గుర్తు పెట్టుకోవాలి. ప్రత్యర్థికి తక్కువ సమయంలోనే.. ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించేలా ఒత్తిడి పెంచాలి.
కనీసం 400- 450 పరుగుల మేర లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్ గెలవగలం. వికెట్‌ను బట్టి ఎప్పటికప్పుడు ఆటను మార్చుకుంటూ ఉండాలి’’ అశ్విన్ భారత జట్టుకు సూచించాడు.
అద్భుతమైన ఆటగాడు అతడు
ఇక రిషభ్ పంత్ తొలి టెస్టులో రెండు శతకాలు బాదడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘విరాట్ కోహ్లితో పోల్చగల ఆటగాడు. ఒకవేళ నేనే గనుక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అయి ఉంటే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి.. ‘నువ్వు అద్భుతంగా, అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశావు. ఈసారి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చు.
130 పరుగులు చేసినపుడు కూడా నువ్వొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన లోయర్ ఆర్డర్ అంతగా బ్యాటింగ్ చేయలేదు కాబట్టి.. నువ్వు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి’ అని చెప్పేవాడిని. వాహ్.. ఎంతటి అద్భుతమైన ఆటగాడు అతడు’’ అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.
అదే విధంగా.. శతకం బాదిన తర్వాత ఫ్లిప్ కొట్టి సెలబ్రేట్ చేసుకోవద్దని అశూ ఈ సందర్భంగా పంత్‌కు సూచించాడు. ఐపీఎల్ ఆడేటపుడు శరీరం ఎక్కువగా అలసిపోదని.. అప్పుడు జంప్ కొట్టినా పర్లేదన్న అశూ.. టెస్టు క్రికెట్ అందుకు భిన్నమని సున్నితంగా హెచ్చరించాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లో జూలై 2-6 రెండో టెస్టు జరుగుతుంది.