4 రోజులు సిట్ కస్టడీ
శివాజీనగర: లైంగిక దాడి, కిడ్నాప్ తదితర కేసుల్లో శనివారం రాత్రి అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణను ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్‌ఐటీ) అధికారులు రాత్రంతా విచారించారు. మరోవైపు ఆయనకు కోర్టు 4 రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతించింది. రాత్రి విచారణలో రేవణ్ణ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. మహిళ కిడ్నాప్‌కు నాకు సంబంధం లేదు. నేను ఎవరినీ కిడ్నాప్ చేయలేదు అని చెబుతున్నారని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అర్ధరాత్రి వరకు రేవణ్ణను మహిళ కిడ్నాప్ కేసులో కూలంకుషంగా విచారించారు. సిట్ చీఫ్, ఏడీజీపీ బీ.కే.సింగ్ బృందం విచారణలో పాల్గొంది. ఆరోపణలను రేవణ్ణ నిరాకరించారు. నేను ఆమెను కిడ్నాప్ చేయలేదు, ఎన్నికలు ఉన్న కారణాన ఆమె నా ఇంటికి వచ్చారు. ఆమె కొన్ని సంవత్సరాల నుండి నా ఇంట్లో పని చేస్తుండేవారు. ఆమె గురించి గాని, కిడ్నాప్ గురించి ఏమీ తెలియదు అని రేవణ్ణ చెప్పినట్లు సమాచారం. రాత్రి ఆయనను సిట్ ఆఫీసులోనే నిద్రపోనిచ్చారు. ఆదివారం కొన్ని ప్రశ్నలను అడిగి విచారణను కొనసాగించారు. సదరు మహిళపై రేవణ్ణ తనయుడు, ఎంపీ ప్రజ్వల్ అత్యాచారం చేశాడా?, ప్రజ్వల్‌ను తప్పించేందుకు ఆమెను కిడ్నాప్ చేయించారా? అనే కోణాలలో సిట్ విచారణ జరుపుతోంది.
కస్టడీకి అనుమతి
ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య కోరమంగళలోని 17వ ఏసీఎంఎం కోర్టు జడ్జి రవీంద్ర కట్టిమని ఇంట్లో రేవణ్ణను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ కోసం ఆయనను వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ న్యాయవాదులు కోరారు. జడ్జి ఆలకించి, 4 రోజుల పాటు.. అంటే 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ కస్టడీకి అనుమతించారు. దీంతో రేవణ్ణను సిట్ అప్పటివరకు విచారించే అవకాశముంది. రేవణ్ణ బెయిలు కోసం ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బెయిలు అర్జీ సమర్పించారు. సోమవారం విచారణ జరగనుంది.
ప్రజ్వల్ నివాసం సీజ్
ఎంపీ ప్రజ్వల్ ప్రభుత్వ నివాసానికి సిట్ అధికారులు తాళాలు వేశారు. ప్రజ్వల్‌కు హాసన్ ఆర్‌సీ రోడ్డులో ప్రభుత్వం కేటాయించిన నివాసం ఉంది. బాధితుల సమక్షంలో శనివారం రాత్రి మహజరు జరిపిన సిట్ అధికారులు నివాసానికి తాళం వేసి సీల్ వేశారు. తొలి అంతస్తు గదిలో అత్యాచారం జరిగిందనే ఆరోపణ వినిపించింది. ఇక్కడే నగ్న వీడియోలు రికార్డు చేసినట్లు అనుమానాలున్నాయి. ప్రజ్వల్ సిట్ విచారణకు వస్తారా?, రారా? అన్నది మిస్టరీగా మారింది.
పాస్‌పోర్టును రద్దు చేయరెందుకు?
దొడ్డబళ్లాపురం: ప్రజ్వల్, రేవణ్ణ కేసుల్లో బాధిత మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా ఆదివారం తెలిపారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత 75 సంవత్సరాల్లో ఇలాంటి దారుణ సంఘటన జరగలేదని, బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని సుర్జేవాలా అన్నారు. ప్రధాని మోదీ ప్రజ్వల్ పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేయలేదని, ఇంటర్‌పోల్ ద్వారా ఎందుకు బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment