పోలీసుల అదుపులోని వ్యక్తి అదృశ్యం
పోలీసుల అదుపులోని వ్యక్తి అదృశ్యం
Published Wed, Apr 12 2017 11:07 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
అర్ధరాత్రి వరకూ గ్రామస్తులు ఆందోళన
కానిస్టేబుల్‌పై చర్యలకు డీఎస్పీ హామీ
ఆందోళన విరమణ
అదృశ్యంపై కేసు నమోదు
కొత్తపేట : ఒక కేసు విషయంలో పోలీసులు తీసుకువెళ్లిన వ్యక్తి అదృశ్యంపై అతని వర్గీయులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ ముట్టడించి, రాస్తారోకో చేసి ఆందోళన చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య హామీతో ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఆందోళన విరమించారు. ఈ ఘటనకు సంబంధించి వాడపాలెం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొత్తపేట మండలం వాడపాలెంలో ఈ నెల 8 న ఇరువర్గాలు ఘర్షణ పడగా కొండేపూడి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు 9న సలాది సత్యం (పెద్దకాపు), చోడపునీడి నాగరాజు (బుజ్జి) లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 10 న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 11వ తేదీ రాత్రి పెద్దకాపు కుటుంబ సభ్యులు పెదకాపు కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అతనిని ఇంటికి పంపేశామని పోలీసులు తెలిపారు. మూడు రోజులుగా ఇంటికి రాని పెద్దకాపు గురించి ఆందోళన చెందుతూ ఇదే విషయాన్ని వారి కుటుంబీకులకు తెలిపారు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త బండారు శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో ఎస్సై డి.విజయకుమార్‌ను నిలదీయగా పెద్దకాపు బంధువులు వచ్చి ఆ గొడవతో తమ వ్యక్తికి సంబంధం లేదని వదిలేయాలని కోరగా తమ కానిస్టేబుల్ అర్జున్‌ను ఇచ్చి పంపేశానని, అయితే మార్గం మధ్యలో అతను వాహనం దిగి పరారయ్యాడని వివరించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఆందోళ వ్యక్తం చేస్తూ పెద్దకాపును మీరే అదృశ్యం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ స్టేషన్‌ను ముట్టడించారు. అంతటితో ఆగకుండా అమలాపురం–రావులపాలెం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేసారు.
పోలీసులపై డీఎస్పీ ఆగ్రహం
ఈ సమాచారంతో డీఎస్పీ ఎల్.అంకయ్య అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కొత్తపేట చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన వ్యక్తిని తిరిగి పంపించాలంటే బందువులో లేక పెద్దల పూచికత్తు తీసుకుని పంపిస్థారు కదా?అదేమీ లేకుండా కానిస్టేబుల్‌ను ఇచ్చి పంపడమేమిటి?అని ప్రశ్నించగా స్థానిక పోలీసు అధికారుల వద్ద సమాదానం లేకపోవడంతో స్థానిక పోలీసు అధికారులపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తి కోసం గాలిస్తామని, కానిస్టేబుల్ అర్జున్‌పై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెద్దకాపు భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement