● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● కాగజ్‌నగర్‌ వికాస్‌ సంకల్ప్‌ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్‌, భారత్‌ మాతాకీ జై నినాదాలు | Sakshi
Sakshi News home page

● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● కాగజ్‌నగర్‌ వికాస్‌ సంకల్ప్‌ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్‌, భారత్‌ మాతాకీ జై నినాదాలు

Published Mon, May 6 2024 6:25 AM

● బీజ

అభివాదం చేస్తున్న అమిత్‌షా, పక్కన ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌, బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు

చింతలమానెపల్లి/కౌటాల/కాగజ్‌నగర్‌రూరల్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన ఉమ్మడి జిల్లా కమల దళంలో ఉత్సాహం నింపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు అమిత్‌ షా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం మైదానంలో ఆది వా రం నిర్వహించిన వికాస్‌ సంకల్ప్‌ సభకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు అమిత్‌షా వస్తారని ప్రకటించినా గంట ఆలస్యంగా సాయంత్రం 4 తర్వాత ఆయన సభావేదిక వద్దకు చేరుకున్నారు.

నేరుగా వేదికపైకి..

అమిత్‌ షా పర్యటన కోసం కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్‌సిల్క్‌ శిశుమందిర్‌ విద్యాలయం ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు పట్టణానికి చేరుకున్న ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఎస్పీఎం క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నా రు. సుమారు అరగంటపాటు ప్రసంగించారు. ముందుగా నాగోబాతోపాటు బాసర సరస్వతీ అమ్మవారికి నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఆదివాసీ వీరులు రాంజీగోండు, కుమురంభీం, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీతోపాటు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్‌ను గుర్తు చేశారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుని.. రూ.కోట్లు తరలిస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. ఎస్పీఎం మూతపడింది..’ అంటూ కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేశా రు. రాహుల్‌ గాంధీపై ఓ వైపు విమర్శలు చేస్తూ నే.. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. మంచిర్యాల– వాంకిడి జాతీయ రహదారితోపాటు అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని తెలిపారు. మంచిర్యాల – ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మార్మోగిన నినాదాలు

అమిత్‌షా ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలు, కార్యకర్తలు భారత్‌ మాతకీ జై.. జైశ్రీరామ్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రతిఒక్కరూ సంఘీభావం తెలపాలని అమిత్‌ షా కోరడంతో సభికులు కాషాయ కండువాలు ఊపుతూ ఉత్సాహం చూపారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని రాహుల్‌బాబాగా సంబోధిస్తూ ప్రసంగం కొనసాగించారు. చలోక్తులతో ప్రజలను ఆకట్టుకున్నారు. కాగా.. సభలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గోడం నగేశ్‌కు మాట్లాడే అవకాశం రాలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి ప్రసంగానికి ముందు నగేశ్‌ మాట్లాడతారని భావించగా.. వేదికపైకి వచ్చిన అమిత్‌షా నేరుగా ప్రసంగించడంతో గోడం నగేశ్‌కు అవకాశం లేకుండా పోయింది.

హాజరైన ఉమ్మడి జిల్లా ప్రముఖులు

సభకు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, పవార్‌ రామారావు పటేల్‌, పాయల శంకర్‌, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్లు సత్యనారాయణగౌడ్‌, సుహాసినిరెడ్డి, కుమురంభీం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హామీలు మర్చిపోయిన సీఎం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ముఖ్య మంత్రి మర్చిపోయారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. రుణమాఫీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నడు. ఆగస్టులో రుణమాఫీ చేస్తే బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయి.. రైతులు పనులు ఎప్పుడు చేసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయి మరిచి గాడిద గుడ్డు అని వ్యాఖ్యానిస్తున్నారు. గాడిద గుడ్డు కోసం నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా..?

– పాయల్‌ శంకర్‌, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● క
1/3

● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● క

● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● క
2/3

● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● క

● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● క
3/3

● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్‌ షా పర్యటన ● క

Advertisement
Advertisement