తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్‌ | KTR Tweet About Graduate MLC Candidate Anugula Rakesh reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్‌

Published Sat, May 18 2024 4:16 PM | Last Updated on Sat, May 18 2024 4:38 PM

KTR Tweet About Graduate MLC Candidate Anugula Rakesh reddy

సాక్షి, హైదరాబాద్‌: నేడు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిచాలని కోరుతూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని, ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారని తెలిపారు. మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన, అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని పేర్కొన్నారు.

‘అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారు.

సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్‌ను రూపొందించి ఉచితంగా అందజేశారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు.

టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారు. కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు

కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు.ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారికే వేసి.. వారిని గెలిపించాలని కోరుతున్నాం’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement