Lok sabha elections 2024: తొలి దశ పోలింగ్‌ ప్రశాంతం | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: తొలి దశ పోలింగ్‌ ప్రశాంతం

Published Sat, Apr 20 2024 5:21 AM

Lok sabha elections 2024: First phase of the Lok Sabha elections peaceful - Sakshi

ఓటింగ్‌ 62.37 శాతం 

ఓటేసిన దిగ్గజ నేతలు

ఛత్తీస్‌గఢ్‌లో గ్రనేడ్‌ పేలి సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి

పశ్చిమబెంగాల్‌లో స్వల్ప ఘర్షణలు

న్యూఢిల్లీ: పలు చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటిదాకా అందిన గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 102 స్థానాల్లో మొత్తంగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు అందిన సమాచారం మేరకు 62.37 శాతం మేర పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి చెప్పారు. పోలింగ్‌ శాతం ఇంకా పెరగవచ్చని తెలిపారు. మొత్తం లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండగా తొలి దశలోనే అత్యధిక స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 2019లో ఇవే లోక్‌సభ స్థానాల్లో 69.43 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్‌ను అనుమతించారు.

యువ ఓటర్లు.. నవ దంపతులు
ఓటు హక్కు వచ్చాక తొలిసారి ఓటేసేందుకు భారీ సంఖ్యలో యువత ఆసక్తి చూపారు. కొత్త దంపతులు, వృద్దులు, దివ్యాంగులు సైతం పోలింగ్‌ స్టేషన్లకు వచ్చి ఓటు వేశారు. తమిళనాడు, అరుణాచల్‌ ప్రదేశ్, అండమాన్, నికోబార్‌ దీవులు, అస్సాంలోని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు అందిన సమాచారం ప్రకారం త్రిపురలో 80.17 శాతం, పశ్చిమబెంగాల్‌లో 77.57 శాతం, తమిళనాడులో 72.09 శాతం, అస్సాంలో 70.77 శాతం, మేఘాలయలో 74.21 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 58 శాతం, మహారాష్ట్రలో 61.06 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో గిరిజన సంఘాల కూటమి ఇచ్చిన పిలుపు మేరకు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ప్రజలు అసలు పోలింగ్‌ కేంద్రాల వైపే రాలేదు.

మణిపూర్‌లో 69 శాతానికి పైగా
జాతుల మధ్య వైరంతో రావణకాష్టంలా రగిలిపోయిన మణిపూర్‌లో ఆశాజనకంగా 69.13 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇంఫాల్‌ ఈస్ట్, ఇంఫాల్‌ వెస్ట్‌లోని నాలుగు పోలింగ్‌బూత్‌లలో ఆగంతకులు ఈవీఎంలను ధ్వంసంచేశారు. ఒక బూత్‌ను నాశనంచేశారు. తరచూ మావోలు, బలగాల ఎదురుకాల్పుల మోతతో దద్దరిల్లే బస్తర్‌ ప్రాంతం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 63.41 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా గాల్గమ్‌ గ్రామంలో పోలింగ్‌ కేంద్రం సమీపంలో అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌ పొరపాటున పేలడంతో సీఆర్‌పీఎఫ్‌ జవాను దేవేంద్ర తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.   

తమిళనాడులో 72.09% ఓటింగ్‌
రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72.09 శాతం పోలింగ్‌ నమోదైంది. తాంబరంసహా కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలలో సాంకేతిక కారణాలతో పోలింగ్‌ గంట ఆలస్యంగా ఆరంభమైంది. సేలంలో ఇద్దరు వృద్దులు ఓటేసేందుకు పోలింగ్‌కేంద్రానికొచ్చి మరణించారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ సీఎంలు పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామి, తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్‌కుమార్‌ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో 2019 ఎన్నికల్లో 72.44 శాతం పోలింగ్‌నమోదైంది. తమిళనాడుసహా, ఉత్తరాఖండ్, అరుణాచల్, మేఘాలయ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షదీ్వప్‌లలో ఒకే దఫాగా అన్ని స్థానాల్లో శుక్రవారం పోలింగ్‌ జరిగింది. రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్, మణిపూర్, త్రిపుర, జమ్మూకశీ్మర్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని స్థానాలకు పోలింగ్‌ జరిగింది.  

అరుణాచల్‌ అసెంబ్లీకి 65.79%
అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం మధ్యాహ్నం అందిన సమాచారం ప్రకారం అరుణాచల్‌ ప్రదేశ్‌లో 65.79 శాతం పోలింగ్‌ నమోదైంది. 60 అసెంబ్లీ స్థానాలకుగాను 50 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. మిగతా పది చోట్ల బీజేపీ ఇప్పటికే ఏకగ్రీవంగా విజయం సాధించింది. సిక్కింలోని మొత్తం 32 శాసనసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 67.95 శాతం పోలింగ్‌ నమోదైంది.

హైలైట్స్‌
► జమ్మూకశీ్మర్‌ డోడా జిల్లాలో పెళ్లింట అప్పగింతల కార్యక్రమం ఆలస్యంకావడంతో వధువు మోనికా శర్మ ఆలోపు పోలింగ్‌స్టేషన్‌కు వెళ్లి ఓటేసి వచి్చంది
► జైపూర్‌లో 95 ఏళ్ల నేవీ మాజీ అధికారి ఆర్‌ఎన్‌ సింగ్, ఔరంగాబాద్‌లో 92 ఏళ్ల రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌ సింగ్‌ వీల్‌చైర్‌లో వచ్చి ఓటేశారు
► అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అత్యంత అణగారిన షోంపెన్‌ గిరిజన తెగకుచెందిన ఏడుగురు తొలిసారిగా ఓటేశారు.
► బస్తర్‌ పరిధిలో తొలిసారిగా 56 గ్రామాలకు చెందిన ఓటర్లు తమ సొంత ఊళ్లలోనే బూత్‌లు ఏర్పాటుచేయడంతో ఓటేశారు.
► బిహార్, యూపీ, తమిళనాడులోని కొన్ని గ్రామల ప్రజలు తమకు కనీస సదుపాయాలు లేవంటూ పోలింగ్‌ను బహిష్కరించారు
► అస్సాంలోని లఖీంపూర్‌ స్థానంలో ఈవీఎంలున్న కారును తరలిస్తున్న పడవ నీటిలో మునిగింది
► కశ్మీర్‌లో సైలెంట్‌ విలేజ్‌ నుంచి తొలిసారిగా ముగ్గురు మూగ, చెవిటి అక్కాచెల్లెళ్లు ఓటేశారు
► ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా పేరొందిన జ్యోతి ఆమ్గే నాగ్‌పూర్‌ పట్టణంలో ఓటేశారు
► నాగ్‌పూర్‌లో 27 మంది ఉమ్మడి కుటుంబసభ్యులంతా ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు
► బ్యాలెట్‌ పేపర్‌ అయితేనే ఓటేస్తానంటూ హరిద్వార్‌లో ఓ వృద్దుడు ఈవీఎంను నేలకేసి కొట్టాడు
► ఛత్తీస్‌గఢ్‌లోని 102 నియోజకవర్గాల్లో మహిళా సిబ్బంది ‘పింక్‌’ దుస్తుల్లో హాజరయ్యారు
► అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో పోలింగ్‌ సిబ్బంది 40 కిలోమీటర్లు కాలినడకన కొండకోనలు ఎక్కిమరీ మారుమూల ప్రాంతంలో ఏర్పాటుచేసిన మాలోగామ్‌ పోలింగ్‌స్టేషన్‌లో ఏకైక ఓటరైన 44 ఏళ్ల మహిళ సోకేలా తయాంగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Advertisement
Advertisement