రంగనాథుని సేవలో మోదీ | Sakshi
Sakshi News home page

రంగనాథుని సేవలో మోదీ

Published Sun, Jan 21 2024 4:16 AM

PM Narendra Modi prayers at Sri Ranganatha Swamy Temple, Srirangam, Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై/ తిరుచిరాపల్లి: కొద్దిరోజులుగా శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న ప్రధాని మోదీ అందులో భాగంగా శనివారం తమిళనాడులోని ద్వీప పట్టణం ‘శ్రీరంగం’లోని ప్రఖ్యాత శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ధోతి, అంగవస్త్రం, రుద్రాక్షమాలతో తమిళ సంప్రదాయ ఆహార్యంలో ఆలయానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఆలయ నిర్వహణ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి వేదాలు పఠిస్తూ పండితులు తోడు వచ్చారు.

మోదీ ఆ తర్వాత రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. రామానుజాచార్య, చక్రత్తాళ్వార్‌ సన్నిధాలను సందర్శించారు. ఆలయ ఏనుగు ఆండాళ్‌ ఆశీ్వరాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మౌతార్గాన్‌ వాయిస్తూ ఆహ్వానం పలకడం విశేషం. భారత ప్రధాని రంగనాథ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి. 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తమిళ కవి కంబ రచించిన కంబ రామాయణాన్ని ఈ సందర్భంగా మోదీ పారాయణం చేశారు. తమిళనాడులోని ప్రఖ్యాత వైష్ణవదేవాలయాల్లో రంగనాథాలయం ముఖ్యమైనది. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది.

రామేశ్వరం ఆలయంలోనూ...
శనివారం మధ్యాహ్నం మోదీ రామేశ్వరం వెళ్లారు. అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. 22 పవిత్ర తీర్థాలలో స్నానం చేశారు. ప్రాచీన శివాలయమైన ప్రఖ్యాత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తి, భజన కార్యక్రమాల్లో పాల్గొని భజన చేశారు. రామయణ గాథతో ఈ ఆలయానికి గాఢానుబంధం ఉంది. అనంతరం పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు, స్థానికులతో మోదీ మాట్లాడారు. రాత్రి రామేశ్వరంలోని రామకృష్ణ మఠంలో బస చేశారు. ఆదివారం ఉదయం ఆయన మళ్లీ రామేశ్వరం అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేసి మరోమారు రామనాథస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సమీప గ్రామంలోని కోడండరామస్వామి దర్శనంతో మోదీ మూడు రోజుల తమిళనాడు పర్యటన పూర్తవుతుంది.

తిరుచిరాపల్లిలో రోడ్‌ షో
తిరుచిరాపల్లి పురవీధుల్లో జనం మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూలవర్షం కురిపించారు. వారందరికీ వనక్కమ్‌ అంటూ మోదీ అభివాదం చేశారు. జై శ్రీరామ్‌ నినాదాలతో ఆ మార్గమంతా మార్మోగిపోయింది. అక్కడి నుంచి శ్రీరంగం వైపుగా మోదీ రోడ్‌షో కొనసాగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement