టెస్లా అధినేత ఇలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఐఫోన్లలో చాట్ జీపీటీ టెక్నాలజీని వినియోగిస్తే... తమ సంస్థలో ఆ ఫోన్లను నిషేధిస్తామని యాపిల్‌కు వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఇలా ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే... ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ మస్క్ వెనక్కి తగ్గడం వెనక ఆంతర్యం ఏంటి?
ఓపెన్ ఏఐతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై దాఖలు చేసిన దావాను వెనక్కి తీసుకుంటున్నట్లు కాలిఫోర్నియా కోర్టులో మస్క్ న్యాయవాదులు తెలిపారు. మస్క్ తరపున వాదించిన అటార్నీలు.. ఆ దావాను కొట్టేయాలని కోర్టును కోరారు. ఫిబ్రవరిలో ఆ దావాను దాఖలు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో కోర్టులో దావా రద్దుకు చెందిన ఫైలింగ్ నమోదు చేశారు. మానవాళి ఉపయోగం కోసం కృత్రిమ మేథను డెవలప్ చేయాలని, లాభాల కోసం కాదన్న అంశంపై ఆల్ట్‌మాన్‌పై మస్క్ దావాను దాఖలు చేశారు. అయితే చాట్ జీపీటీ డెవలప్ చేసిన ఓపెన్ ఏఐతో పాటు ఆల్ట్‌మాన్‌పై కేసును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు మస్క్ న్యాయవాదులు తెలిపారు.
అయితే, ఈ పరిణామానికి ముందే చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐ విషయంలోనే యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది. చాట్‌జీపీటీ కోసం ఓపెన్‌ఏఐతో యాపిల్ జట్టు కట్టడాన్ని టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తప్పుబట్టారు. కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో యాపిల్ ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇలాన్ మస్క్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే తమ టెస్లా కంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తామని కూడా మస్క్ తెలిపారు.
కాగా, ఓపెన్ ఏఐపై దాఖలు చేసిన దావాను మస్క్ వెనక్కి తీసుకోవడంలో మతలబు దాగుందని సాంకేతిక, న్యాయ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, ఫిబ్రవరిలో దాఖలు చేసిన దావాపై బుధవారం విచారణ జరగాల్సివుంది. అయితే, సరిగ్గా విచారణకు ముందే తన వ్యాజ్యాన్ని విత్‌డ్రా చేసుకున్నారు మస్క్. ఆయన దాఖలు చేసిన దావాలో పస లేదని, అలాగే తన సొంత ఏఐ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే... మస్క్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, మస్క్... మున్ముందు ఏదోఒక సమయంలో ఓపెన్‌ఏఐ సంస్థపై తన దావాను రీఫైల్ చేయొచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment