సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది? | Sakshi
Sakshi News home page

Subrata Roy Family: సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది?

Published Wed, Nov 15 2023 8:00 AM

Subrata Roy Family Wife Swapna roy son Sushanto roy Macedonian Citizen - Sakshi

సహారా ఇండియా గ్రూప్ చైర్మన్‌ సహారాశ్రీ సుబ్రతా రాయ్ సహారా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్థాపించిన సహారాగ్రూప్‌ నేడు హౌసింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఆయన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సుబ్రతా రాయ్ సహారా భార్య, పిల్లలు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారు.

సుబ్రతా రాయ్‌కు భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కుమారులు సీమాంతో, సుశాంతో రాయ్ ఉన్నారు. ఆయన తన కుమారుల పెళ్లిళ్లకు రూ.550 కోట్లు ఖర్చు చేశారని చెబుతుంటారు. వీరి వివాహాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం సుబ్రతారాయ్‌ భార్య, కుమారుడు సుశాంతో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. సుబ్రతా రాయ్‌ కుటుంబం ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ దేశమైన నార్త్ మాసిడోనియా పౌరసత్వం తీసుకుంది. 

భారత చట్టాల నుంచి నుంచి తప్పించుకునేందుకే వారు నార్త్ మాసిడోనియా పౌరులుగా మెలుగుతున్నట్లు సమాచారం. సుబ్రతా రాయ్‌పై ‘సెబీ’ కేసు నడుస్తోంది. పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. సుబ్రతా రాయ్‌కి మాసిడోనియన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తుంటాయి. సుబ్రతా రాయ్‌ పలుమార్లు మాసిడోనియా రాష్ట్ర అతిథి హోదాను కూడా అందుకున్నారు. 

సుబ్రతారాయ్‌ భార్య స్వప్నా రాయ్‌పై 2017లో  లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఆమె తరపున దాఖలయిన పిటిషన్‌లో.. ఆమె చట్టాన్ని గౌరవించే మహిళ అని, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పౌరురాలు అని, ఆమెకు నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. సహారా ఇండియా ఫ్యామిలీ ఛైర్మన్ భార్యగా ఆమెకు ఎల్‌ఓసీ జారీ చేశారు. 

మాసిడోనియాలో మూడు బడా వ్యాపారాలను ప్రారంభించాలని సహారా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి డెయిరీ, రెండవది లాస్ వెగాస్ తరహాలో సెవెన్‌ స్టార్ హోటల్, మూడవది ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం ఇండోర్ సెటప్. వీటికి మాసిడోనియా ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతున్నదని తెలుస్తోంది. ఉత్తర మాసిడోనియాలో పౌరసత్వం పొందడం చాలా సులభం. 4 లక్షల యూరోలు పెట్టుబడిగా పెడితే అక్కడి పౌరసత్వం దక్కుతుంది. దీంతో పాటు వారి సంస్థలో 10 మంది స్థానికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి షరతులను నెరవేర్చిన వారు మాసిడోనియన్ పౌరసత్వం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: సహారా చైర్మన్‌ సుబ్రతా రాయ్ కన్నుమూత
 

Advertisement
Advertisement