మళ్లీ వయోజన విద్య | Sakshi
Sakshi News home page

మళ్లీ వయోజన విద్య

Published Fri, Apr 19 2024 1:35 AM

-

● సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం ● ఎన్‌ఐఎల్‌పీ పేరుతో నూతన కార్యక్రమం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహణ ● పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత నుంచి అమలు?

వలంటీర్లతో బోధన...

న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ద్వారా 15 నుంచి 50 ఏళ్లలోపు నిరక్షరాస్యులను అక్షరాస్యులు చేయనున్నారు. స్వయంసహాయ సంఘాల సభ్యులకు చదువు నేర్పనున్నారు. గతంలో సాక్షర భారత్‌ పథకం కింద సమన్వయకర్తలు చదువు చెప్పేవారు. కొత్తగా చేపట్టే ఈ కార్యక్రమంలో వలంటీర్లను నియమిస్తారు. వీరికి శిక్షణ, సామగ్రిని అందించనున్నారు. 2027 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

నిర్మల్‌చైన్‌గేట్‌: అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్ల ప్రణాళికతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. జిల్లా పరిషత్‌, పంచాయతీ, స్వయం సహాయక, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో నిరక్షరాస్యుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ (ఎన్‌ఐఎల్‌పీ)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది నుంచే ఈ కార్యక్రమం అమలు కావాల్సి ఉండగా.. ప్ర భుత్వం దృష్టి సారించలేదు. దీంతో ప్రస్తుతం ఈ ప్రోగ్రాం వందశాతం సక్సెస్‌ అయ్యేలా విద్యాశాఖ అధికారులు దృష్టిసారిస్తున్నారు. ఈకార్యక్రమం ద్వారా బడికి దూరంగా ఉంటున్న బాలబాలికలతో పాటు, పెద్దలు, మహిళల్లో సైతం అక్షర జ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభు త్వ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో 2022 నుంచి 2027 వరకు ఐదేళ్లలో ఏడాదికి కోటి మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా రూపకల్పన చేశారు. ఇందులో 2011 జనాభా లెక్కల ప్ర కారం 60 శాతం కంటే తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడత 20,866 మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు.

పర్యవేక్షణ.. నిర్వహణ

ఎన్‌ఐఎల్‌పీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, వయోజన విద్యా అధికారి(కో కన్వీనర్‌), సభ్యులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్‌ ఆఫీసర్లు, జెడ్పీసీఈవో, ఐసీడీఎస్‌, డీపీవో, డీఆర్డీవో, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, న్యాయ సేవా సమితి పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతోపాటు ఉన్నత చదువులకు సహకారం అందించనున్నారు. కల్చరల్‌, ఆర్టిస్టు, ఒకేషనల్‌ కోర్సు, వృత్తి విద్య, ఓపెన్‌లో పది, ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ప్రతిభ చూపేలా ప్రోత్సహిస్తారు. కార్యక్రమం లక్ష్యం చేరుకునేలా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపు, అంగన్వాడీ, యూత్‌, సీనియర్‌ సిటిజన్‌, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, సర్కారు ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో సమయానుకూలంగా ఉదయం లేదా సాయంత్రం డిజిటలైజేషన్‌ ద్వారా వయోజన విద్యాబోధన చేసేలా టైం టేబుల్‌ ప్రకటిస్తారు. వయోజనులకు నోట్‌ బుక్స్‌తోపాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. సమగ్ర అభ్యాస అనుభవాన్ని అందించడానికి అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, డిజిటల్‌ నైపుణ్యాలు వంటి విద్యలోని వివిధ అంశాలను ఏకీకృతం చేసేలా ప్లాన్‌ చేసుకుంటారు. డిజిటల్‌ ప్లాట్‌ ఫారం, వనరుల వినియోగంతోసహా అభ్యాసాన్ని సైతం ఉపయోగించుకుంటారు. ప్రాథమిక అక్షరాస్యతతోపాటు వారి జీవనోపాధి, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఆచరణాత్మక నైపుణ్యాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు.

త్వరలో సర్వే..

జిల్లాలో 1,46,457మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అంచనా. ఎన్‌ఐఎల్‌పీ గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రత్యేక సర్వే ద్వారా వీరిని గుర్తించాల్సి ఉంటుంది. మొదటగా అత్యధిక నిరక్షరాస్యులు ఉన్న పది గ్రామాలను ఎంచుకుని వందశాతం టార్గెట్‌ చేరుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. సర్వేలో నిరక్షరాస్యుల గుర్తింపుతోపాటు గైడ్‌లైన్స్‌ పాటించేలా పర్యవేక్షణ బృందానికి సలహాలు, సూచనలు ఇస్తారు.

2011 లెక్కల ప్రకారం...

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అక్షరాస్యత 57.7 శాతం ఉండగా అందులో పురుషులు 69.03 శాతం, సీ్త్రలు 47.14 గా ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,46,457 మంది నిరక్షరాస్యులు ఉండగా, ఇందులో మహిళలు 99,637, పురుషులు 46,820 మంది ఉన్నట్టు అధికారుల అంచనా. మొద టి విడతలో 20,866 (పురుషులు 8,346, మహిళలు 12,520)మందిని అధికారులు సర్వేచేసి అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు.

Advertisement
Advertisement