ఎన్నికల వ్యయం పకడ్బందీగా నమోదు చేయాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యయం పకడ్బందీగా నమోదు చేయాలి

Published Sat, Apr 20 2024 1:30 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, జిల్లా అధికారులు  
 - Sakshi

● ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్‌ వివేకానంద

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా, అభ్యర్థి తరఫున ఖర్చుచేసే ప్రతీ పైసా ఎన్నికల వ్యయం కింద నమోదు చేయాలని ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్‌ వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌ నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ గౌస్‌ ఆలంతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ అకౌంటింగ్‌ టీం సభ్యులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలన్నారు. ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఈసీ విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయంగా నమోదు చేయాలన్నారు. అలాగే రోజువారిగా దినపత్రికల్లో వచ్చే పెయిడ్‌ న్యూస్‌పై దృష్టి సారించాలని, సోషల్‌ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్లు అశిష్‌ సంగ్వాన్‌, వెంకటేష్‌ దోట్రే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అన్ని టీంలు సిద్ధం..

అనంతరం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్నిరకాల టీమ్‌లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు సీవిజిల్‌ యాప్‌లో 5 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని తెలిపారు. రూ.1.19 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ చెక్‌ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని, 16,089 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, ఈడీఎం నదీం, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement