'కమలం టార్గెట్‌' రెండంకెల బలం | Sakshi
Sakshi News home page

'కమలం టార్గెట్‌' రెండంకెల బలం

Published Wed, Apr 24 2024 4:53 AM

BJP aim is to win 10 to 12 Lok Sabha seats in Telangana - Sakshi

10 నుంచి 12 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్‌ ప్రచారం పూర్తిచేసిన బీజేపీ 

2 నెలల్లో 5 సభలకు ప్రధాని మోదీ హాజరు.. నేతలకు దిశా నిర్దేశం  

ఉత్సాహంగా సాగుతున్న పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు 

జాతీయ స్థాయి నేతలు పాల్గొంటుండటంతో శ్రేణుల్లో జోష్‌ 

నామినేషన్లు ముగిసిన తర్వాత అగ్రనేతల ముమ్మర ప్రచారం 

మే 11లోగా మరో మూడుసార్లు మోదీ రాక.. రేపు సిద్దిపేటకు అమిత్‌ షా 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో రెండంకెల (డబుల్‌ డిజిట్‌) ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. 17 ఎంపీ సీట్లకు గాను 10 నుంచి 12 స్థానాలు గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభా స్థానాల్లో గెలుపొందిన పార్టీగా రికార్డు సృష్టించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో వెనక్కి నెట్టేలా ఫలితాలు రాబట్టాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఆ రెండు పార్టీల కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్‌ ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ అదే దూకుడుతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు కార్యక్రమాల్లో జాతీయ స్థాయి నేతలు పాల్గొనేలా వ్యూహరచన చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోన్న కమలదళం, అగ్రనేతల పర్యటనలతో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నాల్లో ఉంది. 

మోదీ మ్యాజిక్‌పైనే ఆశలు 
రాష్ట్రంలో గత రెండు నెలల్లో ఐదు సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఓ విడత ప్రచారం పూర్తి చేయడంతో రాష్ట్ర పార్టీకి ఊపు వచ్చింది. మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రోజులు ఐదు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడానికి ముందే రాష్ట్రంలో తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేశారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు, గతంతో పోల్చితే వివిధ వర్గాల అభ్యున్నతి కోసం పెద్దయెత్తున అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు.

గత పదేళ్లలో తెలంగాణకు వివిధ పథకాల ద్వారా కేంద్రం చేకూర్చిన లబ్ధి, వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు తదితరాలు వెల్లడించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతు, వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారనే అభిప్రాయం.. తెలంగాణలోనూ గట్టిగా పనిచేస్తుందని, పార్టీకి డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధించి పెడుతుందని జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీపరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ సర్వేల్లో పార్టీకి ప్రజల్లో మద్దతు పెరిగిందని, మెజారిటీ ఎంపీ సీట్లలో గెలుపొందుతామని ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

కార్యాచరణ వేగవంతం 
డబుల్‌ డిజిట్‌ లక్ష్య సాధనకు ఇప్పటికే ప్రాథమిక కసరత్తును పూర్తిచేసిన బీజేపీ.. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేసింది. వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతోంది. జిల్లాలు, పార్లమెంట్‌ నియోజక వర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయిలో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్లను పలుమార్లు కలవడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, స్వయంగా ఓటర్లను కలవడం, కార్నర్‌ మీటింగ్‌లు లాంటి ఔట్‌ రీచ్‌ కార్యక్రమాల ద్వారా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్‌) లాంటివి అందజేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండోవిడత, వచ్చేనెల 9,10,11 తేదీల్లో మూడోవిడత ప్రచారాన్ని పూర్తిచేయనున్నారు.  

4, 6, 8 తేదీల్లో మోదీ పర్యటన 
రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ నింపేలా ఆయన పర్యటన ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇండోర్‌ స్టేడియంలో ఐటీ వృత్తి నిపుణులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ఓ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది.

అదే విధంగా ఓటర్లలో యాభై శాతం మంది దాకా మహిళలు ఉండడంతో వీరిని ఆకట్టుకునేలా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మోదీతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది.  నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్‌; ఖమ్మం ఎంపీ సీట్లలో ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేసేలా జనగామలో లేదా అక్కడికి దగ్గరలో మోదీ పాల్గొనేలా ఓ సభ నిర్వహించాలని భావిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్‌లో లేదా నగర శివార్లలో జరిపే భారీ బహిరంగ సభతో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నట్టు సమాచారం.  

రేపు రాష్ట్రానికి అమిత్‌ షా 
బీజేపీ అగ్రనేత అమిత్‌ షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సిద్దిపేట చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు సభ ఉంటుంది. అనంతరం 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడ ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి భువనేశ్వర్‌కు వెళ్తారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement