జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు | Sakshi
Sakshi News home page

జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు

Published Sun, May 5 2024 12:25 AM

జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం చేశారు. అలాగే, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరపగా తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్‌ శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్‌ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ ఉద్యోగులు విధినిర్వహణ సమయాన తగిన జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్‌ సూచించారు. విద్యుత్‌ భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం ఖమ్మంలో ఖమ్మం రూరల్‌ డివిజన్‌ ఉద్యోగులు, సిబ్బంది సమావేశం నిర్వహించారు. డీఈ సీహెచ్‌.నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్‌ఈ మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం సిబ్బందికి రక్షణ పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈ బాబూరావు, ఏఈడీలు రామకృష్ణ, బీమ్‌సింగ్‌, కోక్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మూడో రోజు

నలుగురు నామినేషన్లు

నల్లగొండ: నల్లగొండ – ఖమ్మం – వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కర్నె రవి నేషనల్‌ నవక్రాంతి పార్టీ తరఫున, స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో సెట్‌ వేశారు. అలాగే, స్వతంత్రులుగా బైరబోతుల శ్రీనివాసరావు, దైద సోమసుందరం, బక్క జడ్సన్‌ నామినేషన్‌ పత్రాలను అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌.మహేందర్‌కు అందజేశారు.

ఓటు వేసిన 1,597 మంది

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ద్వారా శనివారం వరకు 1,597మంది ఓటు వేశారని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు.

వాతవరణంలో మార్పులు

ఉరుములు, మెరుపులతో

పలుచోట్ల వర్షం

ఖమ్మంవ్యవసాయం: వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆతర్వాత జిల్లాలోని పలు చోట్ల పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం నగరంలోనూ ఆకాశం మేఘావృతమైంది. సత్తుపల్లి, వైరా, మధిర వ్యవసాయ డివిజన్లలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా కోత దశలో ఉన్న మామిడి కాయలు నేల రాలినట్లు తెలుస్తోంది. గత నెలలో ఈదురుగాలులు, అకాల వర్షాలకు పలుచోట్ల కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు వరి, మొక్కజొన్న పంటల కోతలు పూర్తవుతున్న దశలో ఉండగా, మామిడి కోతలు సాగుతున్నాయి. ఈనేపథ్యాన అక్కడక్కడా మామిడి పంటకు నష్టం జరిగిందని సమాచారం. అయితే, చిరుజల్లులు మొదలు ఓ మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడగా ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. కాగా, శనివారం జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించగా.. అత్యధికంగా చింతకానిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement
Advertisement