విశ్లేషణ
కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రాంతంలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైనిక పంథాను అనుసరించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయటపెట్టింది. స్థాయిలోనూ, విస్తృతిలోనూ పరిమితమే అయినప్పటికీ, కార్గిల్ రెండు దేశాలలో లోతైన విశ్లేషణను ప్రేరేపించింది.
1999 ఫిబ్రవరి 20న, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్‌లో చరిత్రాత్మక దౌత్య పర్యటనకు బయలుదేరారు. మరుసటి రోజు, ఇద్దరు ప్రధానులు లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు గురించిన భాగస్వామ్య దార్శనికతను ఇరువురు నేతలూ ప్రతిబింబించారు.
ఉద్రిక్తతలను పెంచిన 1998 అణు పరీక్షల ఛాయల నుండి ఉద్భవించిన ఈ ప్రకటన, సరిహద్దుకు ఇరువైపులా చక్కటి ప్రశంసలు పొందింది. అయితే విచారకరంగా, ఈ ఆశావాదం భ్రమగా మారింది. వాఘా సరిహద్దులో వాజ్‌పేయికి షరీఫ్ అభివాదం చేస్తున్నప్పుడే, పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన టోలోలింగ్, టైగర్ హిల్ వంటి పర్వత శిఖరాల్లో కందకాలు తవ్వుతున్నారు.
18,000 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ భౌగోళికపరంగా అసాధారణమైన సవాళ్లతో కూడినది. అటువంటి విపరీతమైన పరిస్థి తులలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అయితే అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది.
మే 3న పాక్ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత, జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు మూడు నెలల కాలం కార్గిల్‌లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది, నేలకొరిగిన తన సైనికులను గుర్తించడానికి నిరాకరించింది. ఇది వారి త్యాగానికి అంతిమ అవమానం అని చెప్పాలి.
స్థాయిలోనూ, భౌగోళిక విస్తృతిలోనూ పరిమితమే అయినప్ప టికీ, కార్గిల్ యుద్ధం రెండు దేశాలలో లోతైన వ్యూహాత్మక విశ్లేషణను ప్రేరేపించింది. వేసుకున్న లెక్కలు తప్పడంపై పాక్‌లోనూ; నిఘా వైఫల్యం కారణంగా చొరబాట్లను గుర్తించలేక పోవడంతో సహా, జాతీయ భద్రతా అంతరాలపై భారత్‌లోనూ పెద్ద చర్చ జరిగింది.
యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, పాకిస్తాన్ దురాక్ర మణకు దారితీసిన సంఘటనలను సమీక్షించడానికీ, సాయుధ చొర బాట్లకు వ్యతిరేకంగా జాతీయ భద్రతను కాపాడే చర్యలను సిఫార్సు చేయడానికీ భారత ప్రభుత్వం కార్గిల్ సమీక్షా కమిటీ (కేఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది. రాజకీయ, అధికార, సైనిక, నిఘా సంస్థలు యథా తథ స్థితిపై స్వార్థ ఆసక్తిని పెంచుకున్నాయని ఈ కమిటీ పేర్కొంది. కార్గిల్ అనుభవం, కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, అణుబాంబుతో కూడిన భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.
కేఆర్‌సీని అనుసరించి వచ్చిన మంత్రుల బృందం నివేదిక, జాతీయ భద్రతా సమస్యలపై స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన అత్యంత సమగ్ర పరిశీలన అని చెప్పవచ్చు. గూఢచార యంత్రాంగం, అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ. రక్షణ నిర్వహణను అంచనా వేయడానికి నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
ఈ రెండు నివేదికలు జాతీయ భద్రతా నిర్వహణలో అనేక మార్పులకు దారితీశాయి. కేంద్రీకృత కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ను నిర్వహించడానికి 2004లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థను ఏర్పర్చారు. సైన్యం నిర్దిష్ట గూఢచార అవసరాలను తీర్చడానికి రక్షణ నిఘా సంస్థ ఏర్పడింది. మెరుగైన ఇంటర్–ఏజెన్సీ సమాచారం భాగస్వామ్యాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి బహుళ ఏజెన్సీ కేంద్రం కూడా ఏర్పాటయింది.
రక్షణ వ్యవస్థ కొంత పునర్ని ర్మాణానికి గురైంది. ఇందులో సమీకృత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడం, వ్యూహాత్మక బలగాలు, అండమాన్ నికోబార్ కమాండ్‌ల స్థాపన, త్రివిధ బలగాలకు ఆర్థిక, పరిపాలనా అధికారాలు పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం సిఫార్సు చేసిన విధంగా 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరిగింది.
కొన్ని సిఫార్సులు పాక్షికంగా మాత్రమే అమలైనాయి. ‘ఒకే సరి హద్దులో అనేక బలగాలు ఉండటం కూడా బలగాల జవాబు దారీతనం లోపానికి దారితీసిం’దని మంత్రుల బృందం నివేదిక పేర్కొంది. ‘జవాబుదారీతనాన్ని తేవడానికి, సరిహద్దు వద్ద బలగాల మోహరింపును పరిగణనలోకి తీసుకునేటప్పుడు ‘ఒక సరిహద్దు, ఒక బలగం’ సూత్రాన్ని అవలంబించవచ్చు’ అని సూచించింది. ఈ సూత్రాన్ని ఇంకా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర వర్తింపజేయాల్సే ఉంది. ఇక్కడ భారత సైన్యం, ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీసులు వేర్వేరు కమాండ్ ఏర్పాట్లలో మోహరించారు.
జాతీయ భద్రతా సిద్ధాంతం లేకపోవడం, ఆర్థిక సంవత్సరానికి మించి సైన్యానికి నిధుల నిబద్ధత లేకపోవడం వంటి బలహీనతలను మంత్రుల బృందం ఎత్తి చూపింది. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు ఏవంటే, త్రివిధ బలగాల హెడ్‌క్వార్టర్స్‌ను ప్రభుత్వంలో మరింతగా ఏకీకృతం చేయడం, సాయుధ దళాలు ఉమ్మడిగా ఉండటం. ఇప్పటికీ ఈ లోటుపాట్లు కొనసాగుతున్నాయి.
పాకిస్తాన్ వైపు కూడా, కార్గిల్ పరాజయంపై చాలా బహిరంగ చర్చ జరిగింది. ఆ యుద్ధం పౌర–సైనిక సంబంధాల వక్ర స్వభావాన్ని బహిర్గతం చేసింది. సైనిక లక్ష్యాలను రాజకీయ, దౌత్యపరమైన పరిశీలనలు లేకుండా రూపొందించారు. నసీమ్ జెహ్రా రాసిన ‘ఫ్రమ్ కార్గిల్ టు ది కూ’ పుస్తకంలో, మే 17న సైన్యం అప్పటి ప్రధాని షరీఫ్‌కు కార్గిల్ సైనిక చర్యపై తొలి వివరణాత్మక సమాచారాన్ని అందించిందని రాశారు. ఆ సమయానికి, సైనికులు అప్పటికే నియంత్రణ రేఖ వెంబడి స్థానాలను ఆక్రమించారు.
యుద్ధం తరువాత, దానికి పన్నాగం పన్నిన జనరల్స్ పాత్ర పరిశీలనలోకి రావాలి. దీనికి బదులుగా, పాకిస్తాన్ సైన్యం రాజకీయ నాయకత్వానికి నిందను ఆపాదించడానికి ప్రయత్నించింది. పెరుగుతున్న ఈ అపనమ్మకం చివరకు 1999 అక్టోబర్‌లో షరీఫ్‌ను అధికారం నుండి తొలగించిన సైనిక కుట్రకు దారితీసింది.
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సైనిక పంథాను ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయట పెట్టింది. భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గాలను కనుగొనే బదులు, పాకిస్తాన్ సైన్యం వెనక్కితగ్గి ఉగ్రవాదులను ఉపయోగించింది. యుద్ధం తర్వాత జమ్మూకశ్మీర్‌లో హింస పెరిగింది. కశ్మీర్‌పై మక్కువ పెంచుకోవడం మానుకోవాలనీ, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాలనీ పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
దేశం తన పరిమితులు, ప్రాధాన్యతల గురించి నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా మారాలని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త షాహిద్ అమీన్ రాశారు. ఏమైనప్పటికీ, పాకిస్తాన్‌ను గెలవలేని సంఘర్షణలోకి నెట్టిన ప్రధాన సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. సైన్యం ఇప్ప టికీ దేశ పగ్గాలను నియంత్రిస్తోంది. కశ్మీర్‌పై వాగాడంబరం కొనసాగు తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పైగా, ఉగ్రవాద సంస్థ లకు పాక్ ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది.
నేడు, భారతదేశం చాలా శక్తిమంతమైన దేశం. ఇప్పుడు కార్గిల్ తరహా ఘటన అసంభవంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1999 సంఘర్షణ పాకిస్తాన్ రాజ్యయంత్రాంగపు నిర్లక్ష్య స్థాయిని వెల్లడి చేసింది. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఆ ముద్రను తొలగించ డానికి పెద్దగా అనుకూలించవు.
లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎస్ హుడా (రిటైర్డ్)
వ్యాసకర్త మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment