మోదీకి ‘దక్షిణం’ గుర్తొచ్చింది | Sakshi
Sakshi News home page

మోదీకి ‘దక్షిణం’ గుర్తొచ్చింది

Published Thu, Apr 18 2024 5:47 AM

Chief Minister Revanth Reddy in Wayanad election campaign - Sakshi

ఓట్ల కోసమే ప్రధాని సౌత్‌ టూర్‌

దక్షిణాదిని పదేళ్లు నిర్లక్ష్యం చేశారు 

కేరళలో సీఎం పినరయ్‌ విజయన్‌తో మోదీ సమన్వయం 

తెలంగాణలో 14 సీట్లు, కేరళలో 20 సీట్లు కాంగ్రెస్‌వే.. 

వయనాడ్‌ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్లు దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తే నమ్మేవారెవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. సౌత్‌ ఇండియా కూడా భారత్‌లోనే ఉందనే విషయాన్ని ఇన్నాళ్లు మోదీ, బీజేపీ మరిచిపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రేవంత్‌ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జాతీయ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. మోదీకి, బీజేపీకి రెండుసార్లు మోకా (అవకాశం) ఇచ్చినా, డోకా (మోసం) చేశారని ధ్వజమెత్తారు. ‘సౌత్‌ ఇండియా కూడా భారత్‌లోనే ఉంది. మరెందుకు ఇక్కడికి రాలేదు? బుల్లెట్‌ రైలు, క్రిప్ట్‌ సిటీ, సబర్మతి వంటి రివర్‌ ఫ్రంట్‌ ఎందుకు దక్షిణాదికి ఇవ్వలేదు. ఓట్ల కోసమే దక్షిణ భారత దేశాన్ని గుర్తు చేస్తున్నారు. దక్షిణాది వాళ్లు కూడా చదువుకున్నవాళ్లే. మాకు కూడా రాజకీయం తెలుసు’అని వ్యాఖ్యానించారు. 

ఆర్థిక కేటాయింపులేవీ? 
‘మోదీ దక్షిణ భారతదేశా న్ని బ్యాన్‌ చేశారు. దక్షిణ భారతానికి రాజకీయ ప్రా తినిధ్యం ఇవ్వలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ శాఖ మంత్రి పదవులు ఇవ్వలేదు. ఆర్థిక కేటాయింపులు ఇవ్వలేదు. దక్షిణాదిలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు. దక్షిణాదిలో ఇక జులుం నడవదు’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  

బీజేపీది లీగల్‌ కరప్షన్‌ 
‘అవినీతి గురించి మోదీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవినీతి అంటే హేమంత్‌ బిశ్వశర్మ, అజిత్‌ పవార్, జ్యోతిరాదిత్య సింధియా, అశోక్‌ చవాన్, యడ్యూరప్ప వంటి వంద మంది పేర్లు చెబుతా. కేజ్రీవాల్‌ తన పార్టీ తరపున రూ.100 కోట్లు తీసుకొని పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని కదా అభియోగం. అదే లిక్కర్‌ వ్యాపారులు బాండ్ల పేరుతో రూ. 500 కోట్ల వరకు బీజేపీకి ఇచ్చారు. దీన్నేమంటారు? లీగల్‌ కరప్షన్‌ చేస్తోంది బీజేపీ. కేరళలో సీఎం పినరయి విజయన్‌తో సహా అలాంటి వాళ్లంతా పీఎం మోదీతో సమన్వయం చేసుకుంటున్నారు’అని రేవంత్‌రెడ్డి అన్నారు.    

Advertisement
 
Advertisement