టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రారంభానికి ముందు టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు శుభ సూచకమైన విజయం లభించింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను విండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. జమైకా వేదికగా నిన్న (మే 25) జరిగిన రెండో మ్యాచ్‌లో విండీస్ 16 పరుగుల తేడాతో సఫారీలకు చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది.
వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తొలుత పోటీ ఇచ్చి, ఆతర్వాత పట్టువిడిచిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో 191 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) పరిమితమై లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయారు.
విజృంభించిన విండీస్ బ్యాటర్లు..
ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు విజృంభించడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. బ్రాండన్ కింగ్ (36), కైల్ మేయర్స్ (32), రోస్టన్ ఛేజ్ (67 నాటౌట్), ఆండ్రీ ఫ్లెచర్ (29), రొమారియో షెపర్డ్ (26) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెహ్లుక్వాయో తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
తిప్పేసిన మోటీ..
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ (4-0-22-3) అడ్డుకట్ట వేశాడు. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ప్రొటీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మోటీతో పాటు రోస్టన్ ఛేజ్ (4-0-26-1), షెపర్డ్ (4-0-23-1) కూడా సత్తా చాటడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు.
ఆదిలో సౌతాఫ్రికా బ్యాటర్లు డికాక్ (41), రీజా హెండ్రిక్స్ (34) మెరుపు వేగంతో పరుగులు రాబట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖర్లో డస్సెన్ (30) సైతం రాణించినా ప్రొటీస్‌కు పరాభవం తప్పలేదు. నామమాత్రమైన మూడో టీ20 భారతకాలమానం ఇవాళ అర్దరాత్రి 12:30 గంటలకు (రేపు) ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment