
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో) 14000 పరుగులు చేయడంతో పాటు 700 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూఎస్‌ఏతో నిన్న (మే 25) జరిగిన టీ20లో ఆండ్రియస్ గౌస్ వికెట్ పడగొట్టడం ద్వారా షకీబ్ 700 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని తాకాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌లో 14000 పరుగుల మైలురాయిని తాకిన షకీబ్.. తాజాగా 700 వికెట్ల క్లబ్‌లో చేరిన 17వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఎస్‌ఏలో పర్యటిస్తుంది. ఈ జట్టుకు ఆతిథ్య దేశం, క్రికెట్ పసికూన అయిన యూఎస్‌ఏ నుంచి ఊహించని పరాభవం ఎదురైంది. ఈ సిరీస్‌ను యూఎస్‌ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుని బంగ్లా పులులకు ఊహించని షాకిచ్చింది. నిన్న జరిగిన మూడో టీ20లో గెలుపొంది బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ ఆరు వికెట్లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 11.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment