మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఎస్‌ఏలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ఆఖరి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పసికూన చేతిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది.
హ్యూస్టన్ వేదికగా నిన్న (మే 25) జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ.. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ ధాటికి కకావికలమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ హసన్, సౌమ్య సర్కార్ చెలరేగడంతో వికెట్ కూడా నష్టపోకుండానే విజయతీరాలకు చేరింది.
ఈ మ్యాచ్‌లో ఓడినా యూఎస్‌ఏ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రారంభానికి ముందు ఒకానొక ఆతిథ్య దేశమైన యూఎస్‌ఏకు ఇది బూస్టప్ సిరీస్ విజయం కాగా.. ఐసీసీ రెగ్యులర్ సభ్యదేశమైన బంగ్లాదేశ్‌కు ఈ సిరీస్ ఓటమి విషాదాన్ని మిగిల్చింది.
ఆరేసిన ఫిజ్..
ఈ మ్యాచ్‌లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి యూఎస్‌ఏ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. ఫిజ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫిజ్‌కు టీ20ల్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు.
గతంలో ఇతను వన్డేల్లో భారత్‌పై ఆరు వికెట్ల ప్రదర్శన (6/43) నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున తొలి ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ ఫిజ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన ఆరో బౌలర్‌గా (అజంత మెండిస్ (2), దీపక్ చాహర్, యుజ్వేంద్ర చహల్, ఓబెద్ మెక్‌కాయ్, అస్టన్ అగర్) ఫిజ్ చరిత్రపుటల్లోకెక్కాడు.
The celebrations of USA Team after winning the T20I series against Bangladesh.
- The Historic Moments for USA Cricket. 🙌 pic.twitter.com/zyQcygwjPL— Tanuj Singh (@ImTanujSingh) May 26, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. ముస్తాఫిజుర్‌తో పాటు రిషద్ హొసేన్ (4-1-7-1), తంజిమ్ హసన్ (4-1-32-1), షకీబ్ అల్ హసన్ (3-0-23-1) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 104 పరుగులకు పరిమితమైంది. యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌లో ఆండ్రియస్ గౌస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 11.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది.
బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇది అతి భారీ విజయమైనప్పటికీ పసికూన యూఎస్‌ఏ చేతిలో సిరీస్ పరాభవం అంతుచిక్కని విషాదాన్ని మిగిల్చింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (10 వికెట్లు) ముస్తాఫిజుర్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment