అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నిక్కీ మినాజ్‌కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ ఎయిర్‌పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్‌స్టర్‌డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఉంచారు.
ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment