భగభగల్లోనూ బ్రహ్మరథం  | Sakshi
Sakshi News home page

భగభగల్లోనూ బ్రహ్మరథం 

Published Sat, Apr 20 2024 5:29 AM

Day 18 memantha siddham bus yatra  - Sakshi

కోలాహలంగా 18వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర  

సీఎం జగన్‌కు అడుగడుగునా జన హారతులు

సూరంపాలెం వద్ద జగన్‌కు స్వాగతం పలికిన విద్యార్థులు.. జగన్‌వల్లే తాము ఉచితంగా చదువుకుంటున్నామని ఆనందం 

దద్దరిల్లిన కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ 

సీఎం జగన్‌ తెచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతును తిరిగి బతికించాయి. గతంలో వ్యవ­సాయం చేసి పండించిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. వారు చెప్పిందే ధర. ఆరుగాలం కష్టపడితే లాభం రాకపోగా, నష్టమే కనిపించేది. ఎవరికీ చెప్పుకోవడానికి లేదు.

ఇప్పుడు మా గ్రామంలోనే రైతుభరోసా కేంద్రం వచ్చింది. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఇక్కడే ఇస్తు­న్నారు. పంట నష్టపోతే బీమా అందిస్తున్నారు. నేను 18 ఎకరాలు సాగుచేస్తున్నాను. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.4 లక్షల వరకు లబ్ధిపొందాను. ఇన్నేళ్ల నా జీవితంలో రైతు ఆనందంగా ఉన్నది ఇప్పుడే చూస్తున్నాను. ఇలాంటి నాయకుడే మళ్లీ సీఎం కావాలి. – సత్యనారాయణ, రైతు, రంగంపేట గ్రామం, అనపర్తి నియోజకవర్గం

(‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల కోలాహలం మధ్య సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 18వ రోజు శుక్రవారం కాకినాడ జిల్లాలో కోలాహలంగా సాగింది. అనపర్తి మండలం రంగంపేటకు సమీపంలోని ఎస్‌టీ రాజపురం వద్ద ఏర్పాటుచేసిన నైట్‌ స్టే పాయింట్‌ నుంచి ఉదయం రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్, ఉండూరు మీదుగా కాకినాడకు చేరుకుంది. మార్గ­మధ్యంలో మహిళలు హారతులు పట్టి సీఎం జగన్‌కు జేజేలు పలికారు.

తమ అభిమాన నేతను చూసేందుకు వృద్ధులు.. రైతులు.. అక్కచెల్లె­మ్మలు పల్లెల నుంచి పరుగుపరుగున రంగంపేటకు చేరుకున్నారు. సూరంపాలెం వరకు 8 కి.మీ. మేర తమ అభిమాన నేత వెంట నడిచారు. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద విద్యార్థులు ‘థ్యాంక్యూ సీఎం సర్‌’ అంటూ భారీ బ్యానర్‌తో స్వాగతం పలికారు. మీవల్లే మేం ఉన్నత చదువులు చదువుకో­గలుగుతున్నాం.

‘అన్నా.. నువ్వు జాగ్రత్త, క్షేమంగా వెళ్లి.. సీఎంగా తిరిగి రా’ అంటూ ఒకరు.. ‘మొనగాడిలా ఒక్కడే వస్తాడు.. చరిత్ర సృష్టిస్తాడు’ అని ఇంకొకరు.. ‘పేదవాడి ఇంట్లో కష్టం లేకుండా ఉండాలంటే మళ్లీమళ్లీ నువ్వే సీఎంగా రావాలన్నా’ అంటూ మరో విద్యార్థి, ‘అన్నా నువ్వు జాగ్రత్త.. నీ ఆరోగ్యం జాగ్రత్త..’  ‘వైనాట్‌ 175.. వన్స్‌మోర్‌ సీఎం జగనన్న..’ వంటి ప్లకార్డులతో విద్యార్థులు తమ ఆనందాన్ని, అభిమానాన్ని చాటారు. 

జగన్నినాదాలతో హోరెత్తిన రంగంపేట..
ఉదయం ఎస్‌టీ రాజపురం వద్ద ప్రారంభమైన యాత్రకు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలతో రంగంపేట కిక్కిరిసిపోయింది. దారిపొడ­వునా జనం జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. సామర్లకోట సెంటర్‌ వద్ద మహిళలు జగన్‌ కాన్వాయ్‌కి హారతులిచ్చారు. జానపద నృత్యాలు, తీన్‌మార్‌ నృత్యా­లతో జననేతకు స్వాగతం పలికారు. అచ్చంపేట ఫ్లైఓవర్‌ వద్ద ఓ పాత ఫొటోతో ఎదురువస్తున్న వృద్ధురాలిని చూసిన జగన్‌ తన వాహనాన్ని ఆపి ఆమెను పలకరించగా.. తన పేరు మోర్త కుమారి అని, గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ మార్గంలో వచ్చినప్పుడు తాను జున్ను పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

అప్పుడు ఆయన వచ్చారు, ఇన్నేళ్లకు మీరు వచ్చారంటూ ఆమె తెగ సంబరపడింది. అలాగే, కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే రోగిని తీసుకుని ఆమె బంధువులు జగన్‌ కోసం ఎదురుచూస్తూ రోడ్డుపై వేచివున్నారు. వీరిని చూసి జగన్‌ తన వాహనాన్ని ఆపి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఖర్చుచేసిన బిల్లులను జాగ్రత్తచేయాలని పేషెంట్‌ బంధువులకు సూచించారు.

కృష్ణవేణికి అవసరమైన వైద్య సహా­యాన్ని అందించే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. మనసున్న మారాజు అని, ప్రజా సమస్యలపట్ల జగన్‌ స్పందిస్తున్న తీరును చూసి మళ్లీ సీఎంగా ఆయనే రావాలని అక్కడున్న వారంతా బలంగా కోరుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఉండూరు క్రాస్‌ నుంచి బయల్దేరి కాకినాడ రూరల్‌ అచ్చంపేట జంక్షన్‌ వద్ద బహిరంగసభకు చేరుకున్నారు. 

అభిమానం ముందు ఎండ ఎంత?
ఓ పక్క భానుడు భగభగలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతుంటే.. కాకినాడలో మాత్రం జనం ఎండను సైతం లెక్కచేయకుండా అచ్చంపేట జంక్షన్‌కు తండోపతండాలుగా తరలివచ్చారు. తమకు మేలు చేసిన ప్రజా నాయకుడు సీఎం జగన్‌ తమ ప్రాంతానికి వచ్చాడని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

మా అభిమానం ముందు ఈ ఎండ తీవ్రత ఎంత.. అంటూ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సభా ప్రాంగణమైతే జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం యాత్ర పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి, బెండపూడి, అన్నవరం, తుని మీదుగా యాత్ర సాగింది. కత్తిపూడి కూడలి నుంచి ప్రజలు ప్లకార్డులు పట్టుకుని మానవహారం నిర్వహించారు. లోవ సెంటర్‌లో అమ్మవారి ఆశీర్వాదం పొందారు.

తునిలో రోడ్‌ షో హైలెట్‌ 
తునిలో నిర్వహించిన రోడ్డు షో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్‌ లైటింగ్, యువత డ్యాన్సులతో సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు నిలబడి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్‌ సాయంత్రం తుని వస్తారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారి పైకి భారీగా తరలివచ్చారు.

కానీ ఆయన రాత్రి 8.25కు తుని చేరుకున్నారు. మహిళలు గుమ్మడికాయలతో హారతి ఇచ్చి దిష్టితీశారు. జగన్‌ బస్సుపై నుంచి వారికి అభివాదం చేస్తూ రాత్రి పాయకరావుపేటకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ రాత్రి 9.15 గంటలకు వడిచర్ల వద్ద నైట్‌ స్టే క్యాంపునకు జగన్‌ చేరుకున్నారు.

సామాన్యులకు ‘కార్పొరేట్‌’ చదువులు
జగన్‌ సర్‌ వచ్చాకే సామాన్యుల పిల్లలకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి. మాది అనంతపురం జిల్లా గంగవరం గ్రామం. ఇంజినీరింగ్‌లో ర్యాంక్‌ రావడంతో కాకినాడ జిల్లాలో సీటు వచ్చింది. సీఎస్‌ఈ (డేటా సైన్స్‌)లో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను. జగన్‌ రాకముందు.. వచ్చాక రాష్ట్రంలో చదువులెలా ఉన్నాయో చాలా దగ్గర నుంచి గమనించాను.

మా స్కూల్లోనే జగన్‌ సీఎం కాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్‌ స్థాయిలో సదుపాయాలు వచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు జగనన్న విద్యాదీవెన పథకంతో ఇంజినీరింగ్‌ చేస్తున్నాను. మా అన్నయ్యకు కూడా విద్యాదీవెన అందుతోంది. మా నాన్నకు రైతుభరోసా వచ్చింది. ఇలాంటి సీఎంను నేను చూడలేదు.  – చైతన్యరెడ్డి, విద్యార్థిని, అనంతపురం జిల్లా

జగన్‌ సర్‌ రుణం తీర్చుకోలేనిది..
గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువు అంటే భయ­మేసేది. టీచర్లు ఉండేవారు కాదు. టాయిలెట్లు ఉండేవి కావు. వర్షం వస్తే క్లాస్‌రూంలు కారిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్‌ స్థాయిలో ఉన్నాయి. చదువులు బాగున్నాయి.

గతంలో ఇంజినీరింగ్‌ చేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీలేదు. నా పాలిటెక్నిక్‌ చదువు పూర్తిగా ప్రభుత్వ సాయంతోనే పూర్తయింది. మా చెల్లి, తమ్ముడు (కజిన్స్‌)కి అమ్మఒడి వస్తోంది. నా డిప్లొమా అవుతుండగానే జాబ్‌ వచ్చింది, కానీ, జగనన్న విద్యాదీవెన ఇస్తుండడంతో ఇంజనీరింగ్‌ చదవగలుగుతున్నాను. జగన్‌ సర్‌ గ్రేట్‌. హత్యా­యత్నం జరిగినా లెక్కచేయలేదు, నవ్వుతూనే ప్రజల్లో ఉన్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.  – తనూజ, బీటెక్‌ (ఈసీఈ సెకండియర్‌), కాకినాడ

జగనన్న వచ్చాకే మేలు జరిగింది..
నాకు ఇద్దరు పిల్లలు, నా భర్త పాల వ్యాపారం చేస్తాడు. గతంలో రేషన్‌ కార్డు కోసం జన్మభూమి కమిటీలో ఎన్నో­సార్లు అప్లై చేసినా ఇవ్వలేదు. కారణం కూడా చెప్పలేదు. జగనన్న సీఎం అయ్యాక ఇంటికి వలంటీర్‌ వచ్చి మరీ కార్డు ఇచ్చారు. మా పాపకి రెండుసార్లు అమ్మఒడి ఇచ్చారు. ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంత మేలు చేసిన అన్న మా ఊరికి వస్తే చూడకుండా ఉండలేం కదా.. అందుకే నా బిడ్డను తీసుకుని వచ్చాను. – ఈ. శ్రీలత, గాంధీనగర్, కాకినాడ

చేబ్రోలు పట్టు రైతులకు సీఎం హామీ 
ముఖ్యమంత్రి తీరుతో పట్టు రైతుల హర్షాతిరేకాలు 
పిఠాపురం: చేబ్రోలు పట్టు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద చేబ్రోలు పట్టు పరిశ్రమకు చెందిన పట్టు రైతులు తమ సమస్యలు సీఎంకు వినతిపత్రం ద్వారా తెలియజేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, బస్సుయాత్ర చేబ్రోలులో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే.. బస్సుయాత్ర ఆగకుండా వెళ్లిపోయిందని రైతులు నిరాశకు గురయ్యారు.

ఇంతలో బస్సులో నుంచి రైతులు ప్రదర్శించిన ప్లకార్డులను చూసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనతో ఉన్న వారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన.. రైతుల వద్దకు వెళ్లి, వారి వినతిపత్రం తీసుకుని, వారి సమస్యను క్షుణ్ణంగా విని, తగిన పరిష్కారం చూపిస్తామని తన మాటగా చెప్పి రావాల్సిందిగా సీఎంఓ కార్యాలయ గ్రీవెన్స్‌ అధికారి ప్రదీప్‌ను ఆదేశించారు. దీంతో ఆ అధికారి రైతుల వద్దకు చేరుకుని, ముఖ్యమంత్రి తనను పంపించారని చెప్పారు.

రైతులతో మాట్లాడి వారి సమస్యను ఆలకించి, వారి వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారని రైతులకు వివరించారు. దీంతో.. సమయాభావంవల్ల సీఎం ఆగకుండా వెళ్లిపోయినా, రైతులను గుర్తించి.. వెంటనే స్పందించి అధికారిని పంపించడంపై పట్టు రైతులు ఆనందం వ్యక్తంచేశారు.  

Advertisement
Advertisement