సూపర్ సిక్స్ అడ్వరై్టజ్‌మెంట్‌లో పింఛన్ హామీ ఏమైంది
చంద్రబాబు దగాకోరు మాటలు, మోసాలు మొదలయ్యాయి
1994లో ఎన్టీఆర్ హామీలనూ తుంగలోకి తొక్కారు
1999లో ఇస్తామన్న 25 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి
మహిళా బ్యాంకులు ఏర్పాటు చేశారా
మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
చిలకలపూడి (మచిలీపట్నం): ఇటీవల చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవటం.. ఇప్పుడు టీడీపీ తరఫున పత్రికల్లో ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్స్‌లో పవన్‌కళ్యాణ్ ఫొటో లేకపోవటం చంద్రబాబు దగాకోరు విధానానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు.
మచిలీపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అడ్వరై్టజ్‌మెంట్‌లో రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్న హామీ కూడా లేకపోవటం చంద్రబాబు మాయమాటలకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కూటమి అధినేతల ఫొటోలు మాయమవడంతో పాటు హామీలను కూడా మాయం చేసే చంద్రబాబును ప్రజలు దగాకోరుగా అభివర్ణిస్తున్నారన్నారు. ఎన్నికలు రాకముందే మోసం మొదలైందని చెప్పుకుంటున్నారన్నారు.
ఎన్టీఆర్ హామీలనూ తుంగలోకి తొక్కిన ఘనుడు బాబు
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేదం హామీలను అమలు చేస్తే.. కుట్రలు పన్ని, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.50 చేయటంతో పాటు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారని పేర్ని నాని గుర్తు చేశారు. 1999లో ఇచ్చిన మేనిఫెస్టోలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని, ప్రతి పాఠశాలకు పక్కా భవనం నిరి్మస్తామని, మహిళలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
2014లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు.. ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించినప్పుడు ఆశకు హద్దుండాలని వ్యాఖ్యానించటం ఆయనకే చెల్లిందన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, పవన్‌కళ్యాణ్‌తో కూటమి కట్టిన చంద్రబాబు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఆటలో అరటిపండులా వదిలేశాడన్నారు. ఎంతటి వారినైనా మోసం చేసే గుణం చంద్రబాబుకే ఉందన్నారు.
ఇటువంటి చంద్రబాబు మాయమాటలను రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గ్రహించి నక్కజిత్తుల మాటలు నమ్మకుండా ఆలోచించాలన్నారు. వైఎస్ జగన్ అంటే నడిచే నమ్మకంగా చంద్రబాబు మాటలు అపనమ్మకంగా భావించి చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలని కోరారు. మే 13న చంద్రబాబుకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా తీర్పును ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దయనీయ పరిస్థితిలో పింఛన్ లబ్దిదారులు
చంద్రబాబు, ఆయన బంధువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుట్రల కారణంగా పింఛన్ లబ్దిదారులు దయనీయ స్థితిలో ఉన్నారని పేర్ని నాని అన్నారు. హైకోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి పింఛన్ లబ్దిదారులు గడప దాటేలా చేశారన్నారు. బ్యాంకులకు వెళ్లిన లబి్ధదారులకు మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాలను కట్‌చేసి పింఛన్లు ఇస్తుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చిన చంద్రబాబుకు 66 లక్షల మంది పింఛన్‌దారుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment