
పదవి వస్తుందో రాదో అని పవన్‌కళ్యాణ్ నిర్వేదం
యువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..
వైఎస్సార్‌సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా
‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు
విశాఖ ఎన్నికల సభలో పవన్‌కళ్యాణ్
సాక్షి,విశాఖపట్నం/పాలకొండ/వీరఘట్టం: విశాఖ ఎన్నికల సభలో జనసేన అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. యువత గుండెల్లో నిప్పంటించడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడు కూడా గుర్తుకు రాడంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదోనని.. పదవి వస్తుందో రాదోనని కూడా అనుమానం వ్యక్తంచేశారు.
తాను నటుడిని కాకపోతే సాయుధ పోరాటంలోకి వెళ్లేవాడినన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అంతా అవగాహన చేసుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలని, అందుకే తాను గత ఎన్నికల్లో గాజువాక, భీమవరాల్లో ఓడిపోయినా బాధపడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను యువత ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, ఆయనలో ఏముందని ప్రశ్నించారు.
విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి జగదాంబ జంక్షన్‌లో కూర్చోబెడతానని, తొక్కేస్తానని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకపక్క ఆవేశంతోను, మరోవైపు నిర్వేదంతో ప్రసంగించిన పవన్ చెప్పిన అంశాలనే పదేపదే ప్రస్తావించి సభికులకు బోరు తెప్పించారు. పవన్ వచ్చిన కాసేపటికే జనం తిరుగు ముఖంపట్టారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పవన్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపెద్ద పోస్టర్లు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.