శ్రీజను కలవడానికి ఖమ్మం వెళుతున్నా
రాజమండ్రి : విశాఖలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఉదయమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిస్థితులు కుదుట పడుతున్నాయన్నారు. హుదూద్ తుఫాను బాధితులకు అందరూ అండగా నిలవాలని నిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విపత్తు నివారణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తుఫాను పునరావాస సహాయక చర్యల్లో సినీ పరిశ్రమ పాలుపంచుకోవటం అభినందనీయమన్నారు. మున్ముందు ఉత్తరాంధ్రలో పునరావాస కార్యక్రమాల్లో జనసేన పాలుపంచుకుంటుందన్నారు.
కాగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీజను కలవటానికి ఖమ్మం వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి స్పందించిన ఆయన ఈరోజు శ్రీజను పరామర్శించనున్నారు. కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 13 ఏళ్ల శ్రీజ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతోంది.
ఈ చిన్నారికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్‌ను కలిపించేందుకు మేక్ ఎ విష్ ప్రయత్నించింది. అందుకోసం శ్రీజను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వైద్యులు వద్దనడంతో ఆ ప్రయత్నం విరమించింది. దీంతో పవన్ పవన్ కళ్యాణే శ్రీజ దగ్గరికి రావాలని విజ్ఞప్తి చేయటంతో పవన్ సానుకూలంగా స్పందించి తానే ఖమ్మం బయల్దేరారు. ఆయన ఈరోజు ఉదయం రాజమండ్రి నుంచి నేరుగా ఖమ్మం బయల్దేరి వెళ్లారు.