Make a wish Foundation
-
650 కోరికలు.. యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా గిన్నిస్ రికార్డు
‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ మనకు చిరపరిచితమైందే. దాని ద్వారా పిల్లల విషెస్ తెలుసుకుని మన హీరోలు సైతం ఒకటి అరా నిజం చేశారు. కానీ... యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా... 650 మంది విషెస్‌ను నిజం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. 45 ఏళ్ల జాన్... జూలై 19నాటికే ఈ రికార్డును పూర్తి చేసినట్టు గిన్నిస్ ప్రకటించింది. జాన్‌ను ‘హెర్క్యులీన్’(అత్యంత బలశాలి)అని ప్రశంసించింది గిన్నిస్. 42 ఏళ్ల మేక్ ఎ విష్ ఫౌండేషన్ చరిత్రలో... 200 మించిన విషెస్‌ను పూర్తి చేసినవారే లేరట. అలాంటిది 650 మంది పిల్లల కోరికలను నిజం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా! అయితే... పిల్లలు ఎక్కువగా కోరుకునే సెలబ్రిటీ కూడా అతనేనట. 1999లో రెజ్లింగ్ కెరీర్‌ను మొదలుపెట్టిన 2002 నుంచే మేక్ ఎ విష్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. (చదవండి: వీడియో: కానిస్టేబుల్ కక్కుర్తి.. అటు ఇటు చూసి మామిడి పండ్ల దొంగతనం.. అడ్డంగా బుక్కయ్యాడు) -
పిల్లాడి పెద్దమనసు..మేక్ ఎ విష్
భరించలేని బాధ, కష్టం కలిగినప్పుడు చుట్టపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోము. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, బయటపడే ఆలోచనల్లో మునిగిపోతాం. అటువంటిది ఓ చిన్నపిల్లాడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ఎన్నాళ్లు జీవించి ఉంటాడో తెలియనప్పటికీ ... కూడు, గూడు లేనివాళ్ల ఆకలి తీర్చండి అని చెబుతూ, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు. అమెరికాలోని మిస్సిసీపికి చెందిన పదమూడేళ్ల అబ్రహం ఒలెబెగికి గతేడాది ‘అప్లాస్టిక్ ఎనీమియా’ ఉన్నట్టు తెలిసింది. అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా కారణంగా..శరీరంలో సరిపడినంతగా కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావు. దీని వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహం ఏ మాత్రం భయపడలేదు. రెగ్యులర్‌గా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న పిల్లల కోరికలను తీర్చే ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ అబ్రహం గురించి తెలిసి అతని విష్ను తీర్చేందుకు సంప్రదించింది. అందరు పిల్లలు కోరుకున్నట్లే తన జీవిత లక్ష్యాన్ని కోరుకుంటాడని ఫౌండేషన్ అనుకుంది. కానీ అందరికంటే భిన్నంగా ‘‘ఇల్లు లేని వారికి ఏడాది పాటు ఆకలి తీర్చండి, అదే నా మేక్ ఏ విష్’’ అని కోరాడు. అబ్రహం కోరిక నచ్చిన మేక్ ఏ విష్ అతని కోరిక మన్నించడంతోపాటు, మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చింది. పౌండేషన్ సాయంతో గూడులేని నిరాశ్రయులకు ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్నాడు అబ్రహాం. తన తల్లితో కలిసి వందమంది ఆకలిని తీర్చాడు. అబ్రహం పెట్టే ఫుడ్ తిన్న వారంతా థ్యాంక్స్ బాబు అంటూ అబ్రహంకు కృతజ్ఞతలు చెబుతూ ..ఆయుష్షు పెరగాలని దీవిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సాయంతో 2022 ఆగస్టు వరకు కొనసాగనుంది. అబ్రహం టేబుల్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అబ్రహం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాత దొరికితే అతని సమస్య దాదాపు తీరుతుంది. ఫౌండేషన్ సాయంతో నిరాశ్రయుల ఆకలి తీరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహం భవిష్యత్‌లో ‘‘అబ్రహం టేబుల్’’ పేరు మీద ఓ ఎన్జీవోని ప్రారంభించి ఈ సేవలను మరింతగా విస్తరించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రపంచ వ్యాప్త నెటిజన్లు అబ్రహంను మెచ్చుకోవడమేగాక, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
శశాంక్.. 12 ఏళ్లకే ఎస్ఐ
12 ఏళ్ల బాలుడు శశాంక్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. అక్రమ మద్యం, నేరాలను నిరోధించాలని కానిస్టేబుళ్లకు కఠిన ఆదేశాలు ఇచ్చాడు. అలాగే సార్.. అని వారుఅణకువతో సెల్యూట్ కొట్టారు. ఆనందంతో చిన్నారి తల్లి కంట కన్నీరు ఆగలేదు. బనశంకరి: నయం కాని జబ్బులతో బాధపడుతున్న శశాంక్ అనే బుడతని ఆకాంక్షను పోలీసులు పెద్దమనసుతో తీర్చారు. బెంగళూరు విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్‌లో ఒక్కరోజు ఎస్ఐ అయ్యారు. వివరాలు.... చింతామణి నారాయణహళ్లి గ్రామానికి చెందిన మునిరాజ్, సుజాత దంపతుల కుమారుడు శశాంక్ ప్రభుత్వ పాఠశాలలో 7 తరగతి చదువుతున్నాడు. అతడు 5 నెలల పసికందుగా ఉన్న సమయంలోనే తలస్సేమియా జబ్బు తలెత్తింది. రెండేళ్ల నుంచి మధుమేహం కూడా పీడిస్తోంది. రెండు జబ్బులతో నగరంలోని వాణివిలాస్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నాడు. శశాంక్‌కు బాగా చదివి పోలీసు కావాలనే కోరిక ఉంది. కానీ అనారోగ్యంతో చదువు సాగడం లేదు. కోరిక తీరిందిలా బాలుని ఆశను మేక్ ఏ విష్ పౌండేషన్, వాణివిలాస్ ఆసుపత్రి ప్రతినిధులు నేరవేర్చాలని తీర్మానించారు. మంగళవారం విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అయ్యే అవకాశం కల్పించారు. ఆ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రాజు మంగళవారం ఉదయం 9.30 గంటలకు బాలుడు శశాంక్‌కు ఎస్ఐగా అధికార బాధ్యతలు అప్పగించారు. పోలీస్ యూనిఫాంలో వచ్చిన శశాంక్‌కు పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టగానే అన్ని కేసుల వివరాలను ఎస్ఐ శశాంక్ పరిశీలించారు. ఫైళ్లను చూసి పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు కొత్త ఎస్ఐ వచ్చినప్పుడు ఎలాంటి లాంఛనాలు పాటిస్తారో వాటన్నిం టినీ అధికారులు నెరవేర్చారు. డీసీపీశరణప్ప ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలీస్ యూనిఫారంలో తన కుమారుడిని చూసి తల్లికి ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. అక్కడున్న అందరికీ కళ్లు చెమర్చాయి. సంతోషంగా ఉంది: శశాంక్ సంపూర్ణ మద్య నిషేధం చేయాలని, మందుబాబులను సన్మార్గంలోకి తీసుకువచ్చి ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషిచేయాలని ఎస్ఐ శశాంక్ చెప్పారు. ఎంతో సంతోషంగా ఉందని, పోలీస్ కావాలనే చిరకాల కోరిక నేరవేరిందని అన్నారు. తన కుమారుడికి బాగా చదివేవాడని, దురదృష్టవశాత్తూ తలస్సేమియా, మధుమేహం బారినపడ్డాడని తల్లి సుజాతచెప్పారు. అతడి ఆశలను ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తీర్చారని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్, దక్షిణ విభాగ డీసీపీ శరణప్పలకు కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం పోలీసు వాహనంలో ఆస్పత్రికి పంపించారు. -
ఒకరోజు పోలీసు కమిషనర్.. ఇక లేడు!
జైపూర్ నగరానికి ఒకరోజు పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన 11 ఏళ్ల బాలుడు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించాడు. గిరీష్ శర్మ (11) అనే బాలుడు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు గత సంవత్సరం జనవరి నెలలో బయటపడింది. అప్పటినుంచి అతడికి చికిత్స చేయిస్తూనే ఉన్నారు. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో వీధివ్యాపారి అయిన అతడి తండ్రి జగదీష్.. అతడిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. అప్పుడే మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులు గిరీష్‌ను కలిశారు. నీకు ఏం చేయాలని ఉందని వాళ్లు ప్రశ్నించగా.. పోలీసు అవ్వాలని ఉందని గిరీష్ సమాధానమిచ్చాడు. పదేళ్ల కాలంలో 2,250 మంది పిల్లల ఆశలు తీర్చిన ఈ ఫౌండేషన్.. వెంటనే జైపూర్ కమిషనర్‌ను సంప్రదించి చకచకా ఏర్పాట్లు చేసింది. చాలామంది పిల్లలు తమకు సైకిల్ కావాలనో, ఎవరైనా సినిమా హీరోలను కలవాలనో అంటారని.. కానీ గిరీష్ మాత్రం అలా కాకుండా పోలీసు అవ్వాలనుకున్నట్లు చెప్పాడని రాజస్థాన్‌లో ఈ ఫౌండేషన్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సునీతా షా తెలిపారు. అది కష్టమే అయినా.. రాజస్థాన్ పోలీసులు సానుకూలంగా స్పందించడంతో సాధ్యమైందన్నారు. 2015 ఏప్రిల్ 30వ తేదీన గిరీష్ ఎర్రబుగ్గ కారులో పోలీసు యూనిఫాం ధరించి జైపూర్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. అతడిని గార్డ్ ఆఫ్ ఆనర్తో స్వాగతించి, నేరుగా కమిషనర్ చాంబర్‌కు తీసుకెళ్లారు. అప్పటికి నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న శ్రీనివాస జంగారావు వెంటనే తన సీటు ఖాళీ చేసి.. చిన్నారి గిరీష్‌కు అప్పగించారు. గిరీష్ చాలా ఆనందంగా కమిషనర్ కుర్చీలో కూర్చున్నాడు. కానీ ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు. గిరీష్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. సిర్సా మాజీ ఎమ్మెల్యే గోపాల్ కందా అతడి చికిత్స కోసం దాదాపు రూ. 21 లక్షలు ఖర్చుపెట్టారు. చివరకు కిడ్నీ మార్పిడి చేయించినా ఫలితం లేకపోయింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ గిరీష్ మరణించాడు. ఏడాది పాటు తన బిడ్డను కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఆ తండ్రి.. పొగిలి పొగిలి ఏడ్చారు. తన కొడుకు మెడికల్ రికార్డులు, మందులు అన్నింటినీ చితి మీద పెట్టి తగలబెట్టేశారు. -
అందమైన 'మనసున్న' హీరోయిన్
తాను అందమైన హీరోయిన్ మాత్రమే కాదు... అందమైన మనసున్న మనిషినని నిరూపించుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ. సినిమా షూటింగ్స్ తో ఊపిరి సలపకుండా ఉన్నప్పటికీ కాస్త సమయాన్ని వినియోగించింది. ఓ అభిమాని కోరికను తెలుసుకుని ఆశ్చర్యానికి లోనైంది. హీరో రణవీర్ సింగ్ తో కలిసి చిన్నారి ఫ్యాన్ కలను నిజం చేసింది ఈ భామ. అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారి అశ్రిత కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తెలుసుకుంది. నటి అనుష్కశర్మను తనకు కలుసుకోవాలని ఉన్నట్లు ఫౌండేషన్ వారికి ఆ చిన్నారి ఫ్యాన్ చెప్పింది. ఫౌండేషన్ వారు అశ్రిత విషయాన్ని ఆమెకు వివరించారు. స్నేహితుడు రణవీర్ సింగ్ తో సహా ఆ చిన్నారి ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబసభ్యులను ఈ హీరోహీరోయిన్లు ఆశ్చర్యంలో ముంచెత్తారు. అభిమాన హీరోయిన్ అనుష్కతో పాటు రణవీర్ కూడా రావడంతో ఆ చిన్నారి ఫ్యాన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అనుష్క ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి 'సుల్తాన్' మూవీలో నటిస్తోంది. కాగా, ఆదిత్యా చోప్రా తీస్తున్న 'బేఫికర్' షూటింగ్ లో రణవీర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయినా, కాస్త వీలు చూసుకుని ఆ చిన్నారిని కలిసి కాసేపు సందడి చేశారు. ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయని అవి నిజమైనప్పుడు చాలా సంతోషపడతారని అనుష్క చెప్పింది. -
గిన్నిస్‌లోకి సర్దుకుపోయారు...
కాస్త అలా సర్దుకో గురూ అని అంటూనే.. మొత్తం 51 మంది ఈ వ్యాన్‌లో సర్దుకుపోయారు. తద్వారా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. ఆదివారం బ్రిటన్‌లోని మాల్వెర్న్‌లో జరిగిన బస్ఫెస్ట్ వ్యాన్ ఫెస్టివల్లో 1974 నాటి వీడబ్ల్యూ కాంపర్వ్యాన్లో ఒకరి తర్వాత మరొకరు ఇలా 51 మంది సర్దుకోవడం ద్వారా ఈ విభాగంలో ప్రపంచ రికార్డును సాధించారు. దీంతోపాటు ఈ కార్యక్రమం ద్వారా ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కూడా చేశారు. -
కలత తీర్చి... కల నెరవేర్చి!
ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులు 17 మంది కలలు నెరవేర్చిన ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’ అందరిలాగానే వారికీ కొన్ని ఆశలున్నాయి...ఆశయాలు ఉన్నాయి. అవి తీరే దారి మాత్రం కనిపించలేదు. ఆ దారిని మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చూపించింది. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న 17 మంది చిన్నారులు కోరిన కానుకలు అందించి... సహృదయతను చాటుకుంది. ఈ క్రతువులో పోలీసులూ పాలు పంచుకున్నారు. ఆ చిన్ని కళ్లల్లో ఆనందాన్ని నింపారు. సిటీబ్యూరో: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న కొంతమంది చిన్నారుల కలలు నెరవేర్చేందుకు ఓ సంస్థ ముందుకు వస్తే...దానికి తమవంతు సాయం అందించిన పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యం చూసిన బాధితుల తల్లిదండ్రులు తమ బిడ్డల పరిస్థితి తలచుకొని తల్లడిల్లుతూనే... ఆ సంస్థ... పోలీసుల దయార్ధ్ర హృదయానికి ఉప్పొంగిపోయారు. వివరాల్లోకి వెళితే... ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతూ నగరంలోని వివిధ ఆస్పత్రులలో 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరంతా ఎన్నో రోజులుగా కావాలనుకుంటున్న వస్తువులు...బొమ్మలను అందించేందుకు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ‘వరల్డ్ విష్ డే’ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చిన్నారులు కోరిన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులను ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనో ధైర్యం కల్పిస్తే... వారు తొందరగా కోలుకుంటారని చెప్పారు. ఇలా ధైర్యం కల్పించేందుకు యత్నిస్తున్న మేక్ ఎ విష్ ఫౌండేషన్ కృషిని అభినందించారు. డాక్టర్లు ఇంద్రసేనారెడ్డి, సదాశివుడు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులను తగ్గించే దిశగా వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. క్యాన్సర్‌ను సైతం జయించే రోజులు వచ్చాయని తెలిపారు. మందుల వినియోగంతో పాటు బాధితులకు ఆత్మస్థైర్యం కల్పిస్తే వ్యాధి నుంచి త్వరగా బయటపడతారని చెప్పారు. ఈమేరకు అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి కలసి చిన్నారులు అవదూత్ భవాని (15), చెన్నకేశవ(17), పి.మహేష్ (17),శుభం (15), సుమేరాఫాతిమా (16), మహ్మద్ అబ్దుల్ ఖాదర్ (16), అన్కూరి పరశురాములు (16), అంకూష్ లహరి(15)లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. కె.శ్రీను (15), మహ్మద్ మునావర్అలీ (12), మాస్టర్ సాత్విక్ (16), జి.కుమార్ (15)లకు ప్లే స్టేషన్ (బొమ్మలాట)లు, జి.సంహిత్ (16), ప్రశాంత్ (13)లకు ల్యాప్‌టాప్‌లు, సంజయ్‌మోర్ (14)కు మ్యూజిక్ కీబోర్డు, పావని (17)కి ఐపాడ్, అరుణ్‌కుమార్ (7)కు ఎలక్ట్రానిక్ బైక్‌లను అందించారు. తమ పిల్లల్లో ఆనందాన్ని నింపేందుకు ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషిని చూసిన ఆ తల్లిదండ్రులు చెమర్చిన కళ్లతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగ ల్, ఉప్పల్, అనంతపూర్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఈ చిన్నారులు నగరంలోని డయాబైడ్, ఎంఎన్‌జే, తలసీమియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ైవె ద్యులుగా... ఇంజినీర్లుగా ఎదగాలనేది తమ ఆశయమని ఆ చిన్నారులు చెప్పినపుడు అక్కడి వారి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. తమను ఆదుకునేందుకు ఇంతమంది ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని వారంతా కృతజ్ఞతలు చెప్పారు. -
శ్రీజను కలవడానికి ఖమ్మం వెళుతున్నా
రాజమండ్రి : విశాఖలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఉదయమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిస్థితులు కుదుట పడుతున్నాయన్నారు. హుదూద్ తుఫాను బాధితులకు అందరూ అండగా నిలవాలని నిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు నివారణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తుఫాను పునరావాస సహాయక చర్యల్లో సినీ పరిశ్రమ పాలుపంచుకోవటం అభినందనీయమన్నారు. మున్ముందు ఉత్తరాంధ్రలో పునరావాస కార్యక్రమాల్లో జనసేన పాలుపంచుకుంటుందన్నారు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీజను కలవటానికి ఖమ్మం వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి స్పందించిన ఆయన ఈరోజు శ్రీజను పరామర్శించనున్నారు. కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 13 ఏళ్ల శ్రీజ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఈ చిన్నారికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్‌ను కలిపించేందుకు మేక్ ఎ విష్ ప్రయత్నించింది. అందుకోసం శ్రీజను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వైద్యులు వద్దనడంతో ఆ ప్రయత్నం విరమించింది. దీంతో పవన్ పవన్ కళ్యాణే శ్రీజ దగ్గరికి రావాలని విజ్ఞప్తి చేయటంతో పవన్ సానుకూలంగా స్పందించి తానే ఖమ్మం బయల్దేరారు. ఆయన ఈరోజు ఉదయం రాజమండ్రి నుంచి నేరుగా ఖమ్మం బయల్దేరి వెళ్లారు. -
శ్రీజను కలుసుకోనున్న పవన్ కళ్యాణ్
హైదరాబాద్: సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. 'మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి పవన్ కళ్యాణ్ రేపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజను కలుసుకోనున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీజ చికిత్స పొందుతున్నారు. హుదూద్ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణంలో ఖమ్మం చేరుకుని శ్రీజను పరామర్శిస్తారు. -
ఒక్కరోజు సీపీగా సాదిక్
-
చిన్ని... చిన్ని...ఆశ
-
ఒక్కరోజు పోలీస్ కమిషనర్ గా సాదిక్
-
ఒక్కరోజు సీపీగా సాదిక్
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి చిరకాల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీర్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సాదిక్ (10) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ కావలన్నది అతడి కోరిక. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సాదిక్ కోరికను తీర్చింది. సాదిక్ బుధవారం ఉదయం తన ఇంటికి వచ్చిన బుగ్గకారులో కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. ఈ బుల్లి కమిషనర్‌కు అక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు సాదిక్‌కు గౌరవ వందనం చేసారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అతడిని సీపీ సీట్లో కూర్చొపెట్టారు. -
నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు..
సాక్షి, హైదరాబాద్ : ‘‘నువ్వు బాగా చదువుకో... తప్పకుండా డాక్టర్ అవుతావు. నిన్ను నేనే చదివిస్తా. చదువుకయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తా. వైద్య ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఖర్చుల కోసం పార్టీ తరుఫున రూ.5 లక్షల సహాయం అందిస్తా. మీకు ఓ మంచి ఇళ్లు కూడా కట్టిస్తా’అని ముఖ్యమంత్రి కేసీఆర్ హృద్రోగంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదకొండేళ్ల బాలుడు కొండా శరత్‌కు హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన వృత్తిరీత్యా టైలర్ అయిన కొండా భాగ్య, బాలయ్యల కుమారుడు కొండా శరత్(11) పుట్టుకతోనే హృద్రోగం(సెఫ్టల్ డిఫెక్ట్)తో బాధపడుతున్నాడు. ఇప్పటికే మూడుసార్లు సర్జరీ చేశారు. అయినా బాలుని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ‘మేక్ ఎ విష్’ సంస్థ ప్రతినిధులు శరత్‌ను కలసి నీకేమైనా కోరికలు ఉన్నాయా...? అని ప్రశ్నించగా, కేసీఆర్‌ను చూసి, ఆయనతో మాట్లాడాలని ఉన్నట్లు చెప్పాడు. చిన్నప్పటి నుంచి శరత్‌కు కేసీఆర్ అంటే చాలా ఇష్టం టీవీలో ఆయన ప్రసంగం వచ్చిన్నప్పుడల్లా చాలా ఉత్సాహంగా చూసేవాడు. వారు విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో ఆయన గురువారం అపోలో ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. చదువు, వైద్యం ఖర్చులు తామే భరిస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడంతో శరత్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా శరత్ తల్లిదండ్రులు బాలయ్య, భాగ్యలు మాట్లాడుతూ నిత్యం ఎంతో బిజీగా ఉండే కేసీఆర్ లాంటివారు వచ్చి, తమ కుమారుడి కల నెరవేరుస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. కుమారిడి కోరికను నెరవేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. శరత్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ బాలుడికి మెరుగైన వైద్యం అందజేయాలని డాక్టర్లకు సూచించారు.