ఒకరోజు పోలీసు కమిషనర్.. ఇక లేడు! | one day police commissioner, girish sharma passes away | Sakshi
Sakshi News home page

ఒకరోజు పోలీసు కమిషనర్.. ఇక లేడు!

Published Thu, May 5 2016 8:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

ఒకరోజు పోలీసు కమిషనర్.. ఇక లేడు!

ఒకరోజు పోలీసు కమిషనర్.. ఇక లేడు!

జైపూర్ నగరానికి ఒకరోజు పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన 11 ఏళ్ల బాలుడు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించాడు. గిరీష్ శర్మ (11) అనే బాలుడు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు గత సంవత్సరం జనవరి నెలలో బయటపడింది. అప్పటినుంచి అతడికి చికిత్స చేయిస్తూనే ఉన్నారు. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో వీధివ్యాపారి అయిన అతడి తండ్రి జగదీష్.. అతడిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. అప్పుడే మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులు గిరీష్‌ను కలిశారు. నీకు ఏం చేయాలని ఉందని వాళ్లు ప్రశ్నించగా.. పోలీసు అవ్వాలని ఉందని గిరీష్ సమాధానమిచ్చాడు. పదేళ్ల కాలంలో 2,250 మంది పిల్లల ఆశలు తీర్చిన ఈ ఫౌండేషన్.. వెంటనే జైపూర్ కమిషనర్‌ను సంప్రదించి చకచకా ఏర్పాట్లు చేసింది.

చాలామంది పిల్లలు తమకు సైకిల్ కావాలనో, ఎవరైనా సినిమా హీరోలను కలవాలనో అంటారని.. కానీ గిరీష్ మాత్రం అలా కాకుండా పోలీసు అవ్వాలనుకున్నట్లు చెప్పాడని రాజస్థాన్‌లో ఈ ఫౌండేషన్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సునీతా షా తెలిపారు. అది కష్టమే అయినా.. రాజస్థాన్ పోలీసులు సానుకూలంగా స్పందించడంతో సాధ్యమైందన్నారు. 2015 ఏప్రిల్ 30వ తేదీన గిరీష్ ఎర్రబుగ్గ కారులో పోలీసు యూనిఫాం ధరించి జైపూర్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. అతడిని గార్డ్ ఆఫ్ ఆనర్‌తో స్వాగతించి, నేరుగా కమిషనర్ చాంబర్‌కు తీసుకెళ్లారు. అప్పటికి నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న శ్రీనివాస జంగారావు వెంటనే తన సీటు ఖాళీ చేసి.. చిన్నారి గిరీష్‌కు అప్పగించారు. గిరీష్ చాలా ఆనందంగా కమిషనర్ కుర్చీలో కూర్చున్నాడు.

కానీ ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు. గిరీష్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. సిర్సా మాజీ ఎమ్మెల్యే గోపాల్ కందా అతడి చికిత్స కోసం దాదాపు రూ. 21 లక్షలు ఖర్చుపెట్టారు. చివరకు కిడ్నీ మార్పిడి చేయించినా ఫలితం లేకపోయింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ గిరీష్ మరణించాడు. ఏడాది పాటు తన బిడ్డను కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఆ తండ్రి.. పొగిలి పొగిలి ఏడ్చారు. తన కొడుకు మెడికల్ రికార్డులు, మందులు అన్నింటినీ చితి మీద పెట్టి తగలబెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement