
తల్లితో అబ్రహాం
భరించలేని బాధ, కష్టం కలిగినప్పుడు చుట్టపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోము. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, బయటపడే ఆలోచనల్లో మునిగిపోతాం. అటువంటిది ఓ చిన్నపిల్లాడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ఎన్నాళ్లు జీవించి ఉంటాడో తెలియనప్పటికీ ... కూడు, గూడు లేనివాళ్ల ఆకలి తీర్చండి అని చెబుతూ, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు.
అమెరికాలోని మిస్సిసీపికి చెందిన పదమూడేళ్ల అబ్రహం ఒలెబెగికి గతేడాది ‘అప్లాస్టిక్ ఎనీమియా’ ఉన్నట్టు తెలిసింది. అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా కారణంగా..శరీరంలో సరిపడినంతగా కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావు. దీని వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహం ఏ మాత్రం భయపడలేదు. రెగ్యులర్‌గా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు.
ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న పిల్లల కోరికలను తీర్చే ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ అబ్రహం గురించి తెలిసి అతని విష్‌ను తీర్చేందుకు సంప్రదించింది. అందరు పిల్లలు కోరుకున్నట్లే తన జీవిత లక్ష్యాన్ని కోరుకుంటాడని ఫౌండేషన్ అనుకుంది. కానీ అందరికంటే భిన్నంగా ‘‘ఇల్లు లేని వారికి ఏడాది పాటు ఆకలి తీర్చండి, అదే నా మేక్ ఏ విష్’’ అని కోరాడు. అబ్రహం కోరిక నచ్చిన మేక్ ఏ విష్ అతని కోరిక మన్నించడంతోపాటు, మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చింది. పౌండేషన్ సాయంతో గూడులేని నిరాశ్రయులకు ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్నాడు అబ్రహాం. తన తల్లితో కలిసి వందమంది ఆకలిని తీర్చాడు. అబ్రహం పెట్టే ఫుడ్ తిన్న వారంతా థ్యాంక్స్ బాబు అంటూ అబ్రహంకు కృతజ్ఞతలు చెబుతూ ..ఆయుష్షు పెరగాలని దీవిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సాయంతో 2022 ఆగస్టు వరకు కొనసాగనుంది.
అబ్రహం టేబుల్..
ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అబ్రహం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాత దొరికితే అతని సమస్య దాదాపు తీరుతుంది. ఫౌండేషన్ సాయంతో నిరాశ్రయుల ఆకలి తీరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహం భవిష్యత్‌లో ‘‘అబ్రహం టేబుల్’’ పేరు మీద ఓ ఎన్జీవోని ప్రారంభించి ఈ సేవలను మరింతగా విస్తరించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రపంచ వ్యాప్త నెటిజన్లు అబ్రహంను మెచ్చుకోవడమేగాక, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment