one day police
-
శశాంక్.. 12 ఏళ్లకే ఎస్ఐ
12 ఏళ్ల బాలుడు శశాంక్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. అక్రమ మద్యం, నేరాలను నిరోధించాలని కానిస్టేబుళ్లకు కఠిన ఆదేశాలు ఇచ్చాడు. అలాగే సార్.. అని వారుఅణకువతో సెల్యూట్ కొట్టారు. ఆనందంతో చిన్నారి తల్లి కంట కన్నీరు ఆగలేదు. బనశంకరి: నయం కాని జబ్బులతో బాధపడుతున్న శశాంక్ అనే బుడతని ఆకాంక్షను పోలీసులు పెద్దమనసుతో తీర్చారు. బెంగళూరు విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్‌లో ఒక్కరోజు ఎస్ఐ అయ్యారు. వివరాలు.... చింతామణి నారాయణహళ్లి గ్రామానికి చెందిన మునిరాజ్, సుజాత దంపతుల కుమారుడు శశాంక్ ప్రభుత్వ పాఠశాలలో 7 తరగతి చదువుతున్నాడు. అతడు 5 నెలల పసికందుగా ఉన్న సమయంలోనే తలస్సేమియా జబ్బు తలెత్తింది. రెండేళ్ల నుంచి మధుమేహం కూడా పీడిస్తోంది. రెండు జబ్బులతో నగరంలోని వాణివిలాస్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నాడు. శశాంక్‌కు బాగా చదివి పోలీసు కావాలనే కోరిక ఉంది. కానీ అనారోగ్యంతో చదువు సాగడం లేదు. కోరిక తీరిందిలా బాలుని ఆశను మేక్ ఏ విష్ పౌండేషన్, వాణివిలాస్ ఆసుపత్రి ప్రతినిధులు నేరవేర్చాలని తీర్మానించారు. మంగళవారం విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అయ్యే అవకాశం కల్పించారు. ఆ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రాజు మంగళవారం ఉదయం 9.30 గంటలకు బాలుడు శశాంక్‌కు ఎస్ఐగా అధికార బాధ్యతలు అప్పగించారు. పోలీస్ యూనిఫాంలో వచ్చిన శశాంక్‌కు పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టగానే అన్ని కేసుల వివరాలను ఎస్ఐ శశాంక్ పరిశీలించారు. ఫైళ్లను చూసి పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు కొత్త ఎస్ఐ వచ్చినప్పుడు ఎలాంటి లాంఛనాలు పాటిస్తారో వాటన్నిం టినీ అధికారులు నెరవేర్చారు. డీసీపీశరణప్ప ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలీస్ యూనిఫారంలో తన కుమారుడిని చూసి తల్లికి ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. అక్కడున్న అందరికీ కళ్లు చెమర్చాయి. సంతోషంగా ఉంది: శశాంక్ సంపూర్ణ మద్య నిషేధం చేయాలని, మందుబాబులను సన్మార్గంలోకి తీసుకువచ్చి ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషిచేయాలని ఎస్ఐ శశాంక్ చెప్పారు. ఎంతో సంతోషంగా ఉందని, పోలీస్ కావాలనే చిరకాల కోరిక నేరవేరిందని అన్నారు. తన కుమారుడికి బాగా చదివేవాడని, దురదృష్టవశాత్తూ తలస్సేమియా, మధుమేహం బారినపడ్డాడని తల్లి సుజాతచెప్పారు. అతడి ఆశలను ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తీర్చారని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్, దక్షిణ విభాగ డీసీపీ శరణప్పలకు కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం పోలీసు వాహనంలో ఆస్పత్రికి పంపించారు. -
‘ఎస్పీ’ శైలజ..నెరవేరిన కల
కామారెడ్డి క్రైం : ఆమె పేరు శైలజ.. రామారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం తాడ్వాయిలోని కేజీబీవీలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది.. ఇటీవల ఎస్పీ శ్వేత ఈ శిబిరాన్ని సందర్శించారు. విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. భవిష్యత్‌లో మీరేం కావాలనుకుంటున్నారు అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కావాలనుకుంటున్నానని శైలజ పేర్కొంది. ఒకరోజు ఎస్పీగా వ్యవహరించాలన్నది తన కోరికని చెప్పింది.. ఆ విద్యార్థిని కల శుక్రవారం నెరవేరింది. ఎస్పీ అనుమతితో శైలజ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయానికి యూనిఫాంలో వచ్చి, ఒకరోజు ఎస్పీగా విధులు నిర్వహించింది. రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్వో రాణి, పోలీస్ బృందం ఆమెకు సహకరించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఎస్పీ మేడమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని, బాగా చదివి ఎస్పీ అవుతానంది. ఎస్పీ అయ్యాక మొదట శ్వేత మేడమ్‌నే కలుస్తానని పేర్కొంది. -
పోలీస్ కమిషనర్‌గా ఆరేళ్ల బాలుడు
సాక్షి, హైదరాబాద్ : బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడి కోరికను తీర్చి హైదరాబాద్ పోలీసులు తమ సహృదయతను చాటుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన చాంద్ పాషా కుమారుడు ఇషాన్(6) గత కొద్దిరోజులుగా బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రెండో తరగతి చదువుతున్న ఇషాన్‌కి పోలీసులంటే చాలా ఇష్టం. దీంతో భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇషాన్ గురించి తెలుసుకున్న రాచకొండ పోలీసులు అతని కోరిక తీర్చేందుకు ముందుకొచ్చారు. ఒక్క రోజు కమిషనర్‌గా వ్యవహరించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం కమిషనర్ ఇషాన్‌కి పోలీసులు సెల్యూట్ చేశారు. అంతేకాకుండా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తన సీటులో కూర్చొబెట్టి మరి ఇషాన్ కోరిక తీర్చారు. -
ఆమె ఒక్క రోజు పోలీస్...
అలహాబాద్: అది ఉత్తర ప్రదేశ్‌లోని సివిల్ లైన్స్ పోలీస్టేషన్. ఆదివారం ఉదయం ఎవరో వీవీఐపీ వస్తున్నట్లు పెద్ద హడావుడి నెలకొంది. ఇంతలో ఓ జీపు వచ్చి ఆగింది. అధికారులంతా అలర్ట్ అయ్యి సెల్యూట్ చేశారు. తీరా చూస్తే అందులోంచి పట్టుమని పదిహేనేళ్లు లేని ఓ అమ్మాయి దిగింది. ఆ బాలిక పేరు సౌమ్య దుబే. అక్కడే ఓ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. పోలీస్ శాఖ నిర్వహించిన ఓ వ్యాస రచన పోటీల్లో నెగ్గటంతో ఒక్క రోజు పోలీసాఫీసర్ గా విధులు నిర్వర్తించే అరుదైన అవకాశం దక్కించుకుంది. ఆగష్టు 8న రిజర్వ్ పోలీస్ ఆడిటోరియంలో ‘ఏ సొసైటీ విత్ అవుట్ పోలీస్’ అన్న అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ప్రతిష్టాత్మక పాఠశాలల నుంచి సుమారు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో టాపర్ గా నిలిచిన సౌమ్యను ఆగష్టు 15న అలహాబాద్ ఎస్ఎస్పీ అనంద్ కులకర్ణి సన్మానించారు కూడా. ఇక ఇవాళ స్టేషన్ హౌజ్ అధికారిగా ఆమె విధులు నిర్వర్తించింది. సౌమ్య అక్కడున్న సిబ్బందితో కాసేపు ముచ్చటించింది. వారి విధి నిర్వహణ ఎలా ఉంటుందో, ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో? అడిగి మరీ తెలుసుకుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఇదే పోటీలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పరిమళ అగర్వాల్, మహింద్ర నాథ్ అను కూడా మరో రెండు స్టేషన్లకు ఇలాగే ఒక్క రోజు అధికారులను చేసేశారు అలహాబాద్ పోలీసులు. -
ఒకరోజు పోలీసు కమిషనర్.. ఇక లేడు!
జైపూర్ నగరానికి ఒకరోజు పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన 11 ఏళ్ల బాలుడు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించాడు. గిరీష్ శర్మ (11) అనే బాలుడు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు గత సంవత్సరం జనవరి నెలలో బయటపడింది. అప్పటినుంచి అతడికి చికిత్స చేయిస్తూనే ఉన్నారు. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో వీధివ్యాపారి అయిన అతడి తండ్రి జగదీష్.. అతడిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. అప్పుడే మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులు గిరీష్‌ను కలిశారు. నీకు ఏం చేయాలని ఉందని వాళ్లు ప్రశ్నించగా.. పోలీసు అవ్వాలని ఉందని గిరీష్ సమాధానమిచ్చాడు. పదేళ్ల కాలంలో 2,250 మంది పిల్లల ఆశలు తీర్చిన ఈ ఫౌండేషన్.. వెంటనే జైపూర్ కమిషనర్‌ను సంప్రదించి చకచకా ఏర్పాట్లు చేసింది. చాలామంది పిల్లలు తమకు సైకిల్ కావాలనో, ఎవరైనా సినిమా హీరోలను కలవాలనో అంటారని.. కానీ గిరీష్ మాత్రం అలా కాకుండా పోలీసు అవ్వాలనుకున్నట్లు చెప్పాడని రాజస్థాన్‌లో ఈ ఫౌండేషన్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సునీతా షా తెలిపారు. అది కష్టమే అయినా.. రాజస్థాన్ పోలీసులు సానుకూలంగా స్పందించడంతో సాధ్యమైందన్నారు. 2015 ఏప్రిల్ 30వ తేదీన గిరీష్ ఎర్రబుగ్గ కారులో పోలీసు యూనిఫాం ధరించి జైపూర్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. అతడిని గార్డ్ ఆఫ్ ఆనర్తో స్వాగతించి, నేరుగా కమిషనర్ చాంబర్‌కు తీసుకెళ్లారు. అప్పటికి నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న శ్రీనివాస జంగారావు వెంటనే తన సీటు ఖాళీ చేసి.. చిన్నారి గిరీష్‌కు అప్పగించారు. గిరీష్ చాలా ఆనందంగా కమిషనర్ కుర్చీలో కూర్చున్నాడు. కానీ ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు. గిరీష్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. సిర్సా మాజీ ఎమ్మెల్యే గోపాల్ కందా అతడి చికిత్స కోసం దాదాపు రూ. 21 లక్షలు ఖర్చుపెట్టారు. చివరకు కిడ్నీ మార్పిడి చేయించినా ఫలితం లేకపోయింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ గిరీష్ మరణించాడు. ఏడాది పాటు తన బిడ్డను కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఆ తండ్రి.. పొగిలి పొగిలి ఏడ్చారు. తన కొడుకు మెడికల్ రికార్డులు, మందులు అన్నింటినీ చితి మీద పెట్టి తగలబెట్టేశారు.