ఆమె ఒక్క రోజు పోలీస్...
అలహాబాద్: అది ఉత్తర ప్రదేశ్‌లోని సివిల్ లైన్స్ పోలీస్టేషన్. ఆదివారం ఉదయం ఎవరో వీవీఐపీ వస్తున్నట్లు పెద్ద హడావుడి నెలకొంది. ఇంతలో ఓ జీపు వచ్చి ఆగింది. అధికారులంతా అలర్ట్ అయ్యి సెల్యూట్ చేశారు. తీరా చూస్తే అందులోంచి పట్టుమని పదిహేనేళ్లు లేని ఓ అమ్మాయి దిగింది.
ఆ బాలిక పేరు సౌమ్య దుబే. అక్కడే ఓ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. పోలీస్ శాఖ నిర్వహించిన ఓ వ్యాస రచన పోటీల్లో నెగ్గటంతో ఒక్క రోజు పోలీసాఫీసర్ గా విధులు నిర్వర్తించే అరుదైన అవకాశం దక్కించుకుంది.
ఆగష్టు 8న రిజర్వ్ పోలీస్ ఆడిటోరియంలో ‘ఏ సొసైటీ విత్ అవుట్ పోలీస్’ అన్న అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ప్రతిష్టాత్మక పాఠశాలల నుంచి సుమారు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో టాపర్ గా నిలిచిన సౌమ్యను ఆగష్టు 15న అలహాబాద్ ఎస్‌ఎస్‌పీ అనంద్ కులకర్ణి సన్మానించారు కూడా. ఇక ఇవాళ స్టేషన్ హౌజ్ అధికారిగా ఆమె విధులు నిర్వర్తించింది.
సౌమ్య అక్కడున్న సిబ్బందితో కాసేపు ముచ్చటించింది. వారి విధి నిర్వహణ ఎలా ఉంటుందో, ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో? అడిగి మరీ తెలుసుకుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఇదే పోటీలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పరిమళ అగర్వాల్, మహింద్ర నాథ్ అను కూడా మరో రెండు స్టేషన్లకు ఇలాగే ఒక్క రోజు అధికారులను చేసేశారు అలహాబాద్ పోలీసులు.