అందమైన 'మనసున్న' హీరోయిన్
తాను అందమైన హీరోయిన్ మాత్రమే కాదు... అందమైన మనసున్న మనిషినని నిరూపించుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ. సినిమా షూటింగ్స్ తో ఊపిరి సలపకుండా ఉన్నప్పటికీ కాస్త సమయాన్ని వినియోగించింది. ఓ అభిమాని కోరికను తెలుసుకుని ఆశ్చర్యానికి లోనైంది. హీరో రణవీర్ సింగ్ తో కలిసి చిన్నారి ఫ్యాన్ కలను నిజం చేసింది ఈ భామ. అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారి అశ్రిత కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తెలుసుకుంది. నటి అనుష్కశర్మను తనకు కలుసుకోవాలని
ఉన్నట్లు ఫౌండేషన్ వారికి ఆ చిన్నారి ఫ్యాన్ చెప్పింది.
ఫౌండేషన్ వారు అశ్రిత విషయాన్ని ఆమెకు వివరించారు. స్నేహితుడు రణవీర్ సింగ్ తో సహా ఆ చిన్నారి ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబసభ్యులను ఈ హీరోహీరోయిన్లు ఆశ్చర్యంలో ముంచెత్తారు. అభిమాన హీరోయిన్ అనుష్కతో పాటు రణవీర్ కూడా రావడంతో ఆ చిన్నారి ఫ్యాన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అనుష్క ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి 'సుల్తాన్' మూవీలో నటిస్తోంది. కాగా, ఆదిత్యా చోప్రా తీస్తున్న 'బేఫికర్' షూటింగ్ లో రణవీర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయినా, కాస్త వీలు చూసుకుని ఆ చిన్నారిని కలిసి కాసేపు సందడి చేశారు. ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయని అవి నిజమైనప్పుడు చాలా సంతోషపడతారని అనుష్క చెప్పింది.