నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు..
నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు..
Published Fri, Aug 15 2014 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
సాక్షి, హైదరాబాద్ : ‘‘నువ్వు బాగా చదువుకో... తప్పకుండా డాక్టర్ అవుతావు. నిన్ను నేనే చదివిస్తా. చదువుకయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తా. వైద్య ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఖర్చుల కోసం పార్టీ తరుఫున రూ.5 లక్షల సహాయం అందిస్తా. మీకు ఓ మంచి ఇళ్లు కూడా కట్టిస్తా’అని ముఖ్యమంత్రి కేసీఆర్ హృద్రోగంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదకొండేళ్ల బాలుడు కొండా శరత్‌కు హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన వృత్తిరీత్యా టైలర్ అయిన కొండా భాగ్య, బాలయ్యల కుమారుడు కొండా శరత్(11) పుట్టుకతోనే హృద్రోగం(సెఫ్టల్ డిఫెక్ట్)తో బాధపడుతున్నాడు. ఇప్పటికే మూడుసార్లు సర్జరీ చేశారు. అయినా బాలుని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ‘మేక్ ఎ విష్’ సంస్థ ప్రతినిధులు శరత్‌ను కలసి నీకేమైనా కోరికలు ఉన్నాయా...? అని ప్రశ్నించగా, కేసీఆర్‌ను చూసి, ఆయనతో మాట్లాడాలని ఉన్నట్లు చెప్పాడు.
చిన్నప్పటి నుంచి శరత్‌కు కేసీఆర్ అంటే చాలా ఇష్టం టీవీలో ఆయన ప్రసంగం వచ్చిన్నప్పుడల్లా చాలా ఉత్సాహంగా చూసేవాడు. వారు విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో ఆయన గురువారం అపోలో ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. చదువు, వైద్యం ఖర్చులు తామే భరిస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడంతో శరత్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ సందర్భంగా శరత్ తల్లిదండ్రులు బాలయ్య, భాగ్యలు మాట్లాడుతూ నిత్యం ఎంతో బిజీగా ఉండే కేసీఆర్ లాంటివారు వచ్చి, తమ కుమారుడి కల నెరవేరుస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. కుమారిడి కోరికను నెరవేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. శరత్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ బాలుడికి మెరుగైన వైద్యం అందజేయాలని డాక్టర్లకు సూచించారు.
Advertisement
Advertisement