మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఎందుకో ఉలిక్కి పడినట్లు ఉంది. ఆయనలో సడన్‌గా భయం ఏర్పడడానికి కారణాలు ఉండవచ్చు. చిరంజీవి అంటే ఒక నీతిమంతుడని, నిజాయితీపరుడని, ప్రజాసేవాభిలాషి అని అంతా అనుకుంటారు. అభిమానులతై ఆయన మాటకు ప్రాణం ఇస్తారు. రాజకీయాలలో సఫలం కాకపోయినా, ప్రజాభిమానానికి కొదవలేని సినీ రంగ ప్రముఖుడిగా వెలుగొందుతున్నారు. ఒక రకంగా సినీ పరిశ్రమను శాసిస్తున్న ఆయన ఎందుకు సినీ పరిశ్రమను పిచ్చుకతో పోల్చారు? రెమ్యునరేషన్ గురించి ఎవరూ అడగవద్దని ఎందుకు అంటున్నారు?
ఎందుకు ఆకస్మికంగా గుర్తుకు వచ్చాయి?
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఇతర ప్రజా సమస్యలు ఆయనకు ఎందుకు ఆకస్మికంగా గుర్తుకు వచ్చాయి? ఇది తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వడం కోసమా? లేక రెమ్యునరేషన్ వ్యవహారం దేశ వ్యాప్త చర్చ అయితే అది అందరికి చుట్టుకుని సినీ పరిశ్రమలో నల్లధనంపై ఫోకస్ పెరుగుతుందన్న సంశయమా? చిరంజీవి హీరోగా నటించిన అనేక సినిమాలలో నిజాయితీ గురించి, అధికార యంత్రాంగంలో ఉండే అవినీతికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల గురించి బోలెడెన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆయన యాక్ట్ చేసిన ఠాగూర్ సినిమా మొత్తం అవినీతికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ సినిమాలను చూసి ఎందరో స్పూర్తి పొంది ఉండవచ్చు.
ముందుగా ఎవరికి చెప్పి ఉండాలి?
ఠాగూర్ సినిమాలో పాడే శ్రీశ్రీ గీతాలతో చిరంజీవిలో ఒక విప్లవకారుడిని చూసుకుని ఉంటారు. కాని ఇప్పుడు అదే చిరంజీవి తమకు సినీ నిర్మాతలు ఇచ్చే పరిహారం అంటే రెమ్యునరేషన్‌తో ప్రభుత్వాలకు పని ఏమిటని అమాయకంగా ప్రశ్నించారు. నిజంగానే చిరంజీవి ఈ రెమ్యునరేషన్ వివాదాలు ఉండకూడదనుకుంటే ముందుగా ఆయన ఎవరికి చెప్పి ఉండాలి? తన సోదరుడు, జనసేన పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్‌కు కదా! ఆయనే ఎవరూ అడగకపోయినా తాను రోజుకు రెండుకోట్లు సంపాదిస్తానని పదే, పదే ఎందుకు చెబుతూ వచ్చారు? అదేదో త్యాగం చేసి రాజకీయాలలోకి వచ్చినట్లు పోజు పెడుతుంటారు కదా!
పవన్ కళ్యాణ్ ఏడాదికి కనీసం వంద రోజులు షూటింగ్‌లలో ఉంటారని అనుకుంటే 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాని ఆయన ఆదాయ పన్ను శాఖకు సమర్పించే రిటర్న్‌లో పది కోట్ల రూపాయలు కూడా చూపించడం లేదని ఆయన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా కొందరు ఆడిటర్లు విశ్లేషించారు. సినిమా రంగంతో పాటు రాజకీయాలోను వెలుగు వెలగాలని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో నిజాయితీ గురించి కథలు చెబుతున్నప్పుడు ప్రత్యర్ధులు ఆయన ఆదాయం గురించి, ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ గురించి ప్రశ్నించకుండా ఉంటారా?.
చిరంజీవి కంగారు పడ్డారా?
పార్లమెంటులో ఒక బిల్లుపై చర్చ సందర్భంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక హిందీ హిరో గురించి చెబుతూ రెమ్యునరేషన్ 250 కోట్ల పైన ఉంటుందని అన్నారట. దానికి ఏమైనా చిరంజీవి కంగారు పడ్డారా?. అదే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు జరుగుతున్న ప్రచారం గురించి భయపడుతున్నారనుకోవాలి. కేంద్రం నిజంగానే సీరియస్‌గా తీసుకుంటే అందరి ఆదాయాలు బయటకు వచ్చి వందల కోట్ల రూపాయల పన్ను కట్టవలసి వస్తుందని చిరంజీవి ఆందోళన చెందుతున్నారా? చెప్పేటందుకే నీతులని అంటారు. అది రాజకీయాలకే కాదు.. సినిమాలకు వర్తిస్తుందని చిరంజీవి మాటలు రుజువు చేస్తున్నాయి.
తమ వెనుక బోలెడు మచ్చలు పెట్టుకుని..
కేవలం సినీ రంగం వారు సినిమాలకు పరిమితం అయితే వారి జోలికి ఎవరూ వెళ్లరు. తమ వెనుక బోలెడు మచ్చలు పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి ఆయా పార్టీల వారిని విమర్శిస్తే వారు ఊరుకుంటారా? వీరి వెనుక ఉండే బొక్కలను వెదకకుండా ఉంటారా?. ఒకాయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా, కొందరితో అక్రమ సంబంధాలు నెరిపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటూ, బయట రాజకీయాలలోకి వచ్చి మహిళల ఉద్దారకుడిగా పిక్చర్ ఇవ్వాలనుకుంటే ఎదుటివారు చూస్తూ ఊరుకుంటారా?.
కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేశారు?
అంబటి రాంబాబుపై తనకు అవకాశం ఉంది కదా అని సినిమాలో ఆయన పాత్రను సృష్టించి అవమానించడం ఎందుకు?. అప్పుడు ఎక్కడ కొట్టాలో రాంబాబుకు తెలియదా? దెబ్బకు దెయ్యం వదిలిందిన్నట్లు సినిమా పరిశ్రమ మొత్తం తమ నల్లధనం విషయాలు బయటకు పొక్కి ఎక్కడ అల్లరి అవుతామో అన్న భయంతో మాట్లాడుతున్నారు. చిరంజీవి కూడా అందుకు మినహాయింపు కాదని అర్ధం అవుతుంది. ఆయన సినిమాల ఆధారంగానే రాజకీయాలలోకి వచ్చారు కదా? సినిమావాళ్ల జోలికి రాజకీయ నేతలు ఎందుకు వస్తున్నారంటూప్రశ్నించేవారు. అదే సూత్రం సినిమా వారికి వర్తిస్తుంది కదా?. సినిమా వారు తమ గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాలోకి ఎందుకు వస్తున్నట్లు?నిజంగా ప్రజాసేవే పరమావధి అనుకుంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓటమి తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేశారు?
కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు?
కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు?. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన మేలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎవరినో మోయడానికి రాజకీయాలలో ఎందుకు కొనసాగుతున్నారు?. ఆదాయపన్ను శాఖ అప్పుడప్పుడు సినిమా నిర్మాతలు, డైరెక్టర్‌లు, నటులపై దాడులు చేసి పెద్ద ఎత్తున బ్లాక్ మనీని పట్టుకుని టాక్స్ కట్టించుకుంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి కొందరు యాక్టర్‌లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో జతకడుతుంటారన్న భావన ఉంది. వీటన్నిటి గురించి ఎవరూ మాట్లాడరాదని చిరంజీవి అనుకోవడమే పెద్ద తప్పు.
సడన్‌గా ఎందుకిలా?
ప్రజా జీవితంలో ఎవరైనా పారదర్శకంగా ఉండాలి. కేవలం సినిమాలలో పాత్రలకే పరిమితం అయి, ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అది అభిమానులను మోసం చేసినట్లు కూడా అవుతుంది. చిరంజీవి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించి అనవసరంగా వివాదంలో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హడావుడిగా రాష్ట్రాన్ని విభజించాలన్న తాపత్రయంలో ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదన్నది విమర్శ. అప్పుడు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ఎక్కడా చెప్పలేదు. కాకపోతే రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెబుతూ వస్తూ, సడన్ గా రాజకీయాలు మాట్లాడడమే సమస్య అయింది.
ఆ సంగతి చిరంజీవికి తెలియదా?
పోనీ ఈయన ఒక నటుడిగా, సామాజిక బాధ్యతతో ప్రత్యేక హోదాపై ఒక సినిమా తీసి ఉండవచ్చు. ఏపీలో పేదల సంక్షేమం జరుగుతోందో లేదో ఒకసారి ఆయన ఏదైనా ప్రాంతానికి వెళ్లి జనంతో మాట్లాడితే తెలుస్తుంది కదా! ఉపాధి, అవకాశాల మీద అంత ఆసక్తి ఉంటే చిరంజీవి విశాఖ లేదా ఇతర ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఎందుకు కృషి చేయడం లేదు?. తెలంగాణ రాజధానిగా ఉన్నహైదరాబాద్‌లో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడితే సరిపోతుందా?. ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి రాగానే లక్షన్నర మందికి ఓకేసారి ఉద్యోగాలు కల్పించిన సంగతి హైదరాబాద్‌లో ఉన్న చిరంజీవికి తెలియకపోవచ్చు.
పిచ్చుకలతో పోల్చడం ఏంటి?
సినీ పరిశ్రమవారిని ఆయన పిచ్చుకలతో పోల్చడం ఆశ్చర్యంగానే ఉంది. తాము బలశాలులమని ఊగిపోతుండేవారికి ఈ సంగతి చెప్పడం మంచిది. ఈ విషయాలు పక్కన బెడితే చిరంజీవి జనసేనకు మద్దతుగా ప్రచారం చేయవచ్చంటూ ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. తమ్ముడికి మద్దతుగా ఏమైనా ప్రకటన చేస్తే చేస్తారేమో కాని, ఆయన స్వయంగా ప్రచారానికి దిగే ధైర్యం చేయకపోవచ్చు. తమ్ముడి తీరు ఆయనకు కూడా అంత నచ్చదని కొందరు చెబుతారు. అది నిజమో కాదో తెలియదు కాని, ఇంతకాలం జనసేనకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేదు. ఈ ఎన్నికలలో కూడా అదే విధానం అవలంభించవచ్చు. చిరంజీవికిగాని, ఇతర సినిమా ప్రముఖులకు కాని తమ నల్లధనం లావాదేవీలు బయటకు వస్తాయేమోనన్న భయం తప్ప వేరొకటి కాకపోవచ్చు. ఇప్పటికైనా సినీనటుల అభిమానులు వాస్తవాలు గుర్తించి, అతికి పోకుండా ఉంటే మంచిదని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment