ఆగస్టు 15 డెడ్‌లైన్‌.. నేను రాజీనామాకు రెడీ: రేవంత్‌కు హరీష్‌ సవాల్‌ | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15 డెడ్‌లైన్‌.. నేను రాజీనామాకు రెడీ: రేవంత్‌కు హరీష్‌ సవాల్‌

Published Thu, Apr 25 2024 4:38 PM

Ex Minister Harish Rao Political Counter To CM Revanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే  తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్‌ రావు సవాల్‌ విసిరారు. దీంతో, ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్‌ హీట్‌ చోటుచేసుకుంది. 

కాగా, మాజీ మంత్రి హరీష్‌ సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్‌ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అలాగే, సీఎంకి కూడా సవాల్‌ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదాం. నేను చర్చకు వస్తాను. రేవంత్ చర్చకు వచ్చే దమ్ముందా?’ అని కామెంట్స్‌ చేశారు. 

 

Video Credit: Telugu Scribe

ఇదే సమయంలో సీఎం రేవంత్‌కు హరీష్‌ రావు కౌంటరిచ్చారు. ‘నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి?. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది?. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
Advertisement