బీ ఫారాలు.. రూ. 95 లక్షలు  | Sakshi
Sakshi News home page

బీ ఫారాలు.. రూ. 95 లక్షలు 

Published Wed, Apr 17 2024 4:36 AM

KCR will give B forms to BRS MP candidates - Sakshi

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు ఇవ్వనున్న అధినేత కేసీఆర్‌  

రేపు తెలంగాణ భవన్‌లో ఎన్నికల వ్యూహాలపై అధినేత దిశానిర్దేశం 

అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కీలక నేతల రాక 

బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పైనా నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం, ఇతర వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ ఈ నెల 18న కీలక సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 18న జరిగే సమావేశంలో వారికి బీ ఫారాలు అందజేస్తారు.

ఎన్నికల ఖర్చుల కోసం ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి పార్టీ తరఫున ఒక్కో అభ్యరి్థకి రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్‌ అందజేస్తారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరవుతారు. భేటీ అనంతరం పార్టీ నేతలతో కలిసి కేసీఆర్‌ మధ్యాహ్నం భోజనం చేస్తారు.  

ఆత్మస్థైర్యం పెంచేలా.. 
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై సమావేశంలో కేసీఆర్‌ దిశా నిర్దేశం చేస్తారు. ప్రచారంలో లేవనెత్తాల్సిన అంశాలు, పార్టీ కేడర్‌తో సమన్వయం, ఓటు బ్యాంకును కాపాడుకోవడం తదితరాలపై సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామనే భావనతో ఉన్న ప్రజలకు మరింత చేరువయ్యేలా దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.

వాగ్దానాల అమలులో రేవంత్‌ ప్రభుత్వం వైఫల్యం, బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సీఎంగా కేసీఆర్‌ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా సూచనలు చేస్తారన్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలను కూడా పార్టీ నేతలకు వివరించి వారిలో ఆత్మస్తైర్యం నూరిపోసేలా కేసీఆర్‌ ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలాఉంటే ఇప్పటికే చేవెళ్ల, అందోలులో ప్రజా ఆశీర్వాద సభల పేరిట బీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఇటీవలి సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో బస్సు యాత్రకు వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని మరోమారు బస్సు యాత్ర చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నెల 18న జరిగే భేటీలో కేసీఆర్‌ బస్సు యాత్ర, రూట్‌మ్యాప్‌పైనా చర్చించి షెడ్యూల్‌ ఖరారు చేస్తారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement