వేడెక్కిన ప్రచారం | Sakshi
Sakshi News home page

వేడెక్కిన ప్రచారం

Published Tue, May 7 2024 1:20 AM

వేడెక

● జిల్లాలో అగ్రనేతల పర్యటనలు ● ప్రధాన పార్టీల శ్రేణుల్లో జోష్‌ ● సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్‌, బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాక ● పార్లమెంట్‌ పరిధిలో అభ్యర్థుల విజయం కోసం నేతల ప్రచారం ● హామీలిస్తూ, విమర్శలు గుప్పిస్తూ, ఉత్సాహం నింపుతూ ముందుకు..

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి లోక్‌సభలో తమ పార్టీ అ భ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు తమ అభ్యర్థుల విజయం కోసం జిల్లా పర్యటనకు వస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌ గుడువు సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రనేతలు పార్లమెంట్‌ను చు ట్టేస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేసమయంలో తమ పార్టీని గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు.

మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి రాక..

● సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.

● ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాంపల్లి బహిరంగ సభలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నిక ప్రచారం చేశారు.

● దివంగత పీవీ, శ్రీపాదరావు, కాకాను గుర్తుచేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం హామీలిస్తూ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపారు.

● కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని,టీ పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

● జిల్లాకేంద్రంలో వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించే సభలో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి పాల్గొననున్నారు.

కార్మికులకు అండగా ఉండేది బీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా రామగుండంలో చేపట్టిన రోడ్డుషోలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం కావడంతో.. గతంలో కాంగ్రెస్‌ సింగరేణిని ముంచిందని, బొగ్గు గనులను బీజేపీ ప్రైవేట్‌పరం చేస్తోందని ఫైర్‌ ఆయ్యారు. తెలంగాణ కోసం, సింగరేణి కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. ఐదునెలల్లో రాష్ట్రంలో కరెంట్‌, సాగు నీటిసమస్యలు తలెత్తాయని, కార్మికుల పక్షాన పార్లమెంట్‌లో గళం విప్పేది బీఆర్‌ఎస్‌ ఎంపీలేనంటూ ప్రచారం నిర్వహించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను పునరుద్ధరించాం..

● బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లి జనసభలో కాషాయ నేతలకు దిశా నిర్దేశం చేశారు.

● జగదల్పూర్‌–పెద్దపల్లి–ధర్మపురి– నిజామాబాద్‌ జాతీయ రహదారిని త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

● మూతపడిన ఎఫ్‌సీఐని ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుద్ధరించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచామని ఆయన అన్నారు.

● బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మంథనిలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో రాజస్థాన్‌ సీఎం భాజన్‌లాల్‌శర్మ పాల్గొననున్నారు.

ఎండలోనూ చుట్టేస్తున్నారు

ముఖ్య నాయకుల సభలు లేని మిగతా రోజుల్లో అభ్యర్థులు ప్రతీ గ్రామంలో పర్యటిస్తున్నారు. కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్డుషోలతోపాటు కుల సంఘాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ పల్లె చుట్టేస్తూ ‘అన్నా.. ఎట్లున్నవు.. చెల్లె, అక్కా బాగున్నావా.. అమ్మా ఓటెయ్యాలే’ అని బంధుగణం, అనుచరగణం

ఇంటింటి ప్రచారం చేస్తోంది.

వేడెక్కిన ప్రచారం
1/1

వేడెక్కిన ప్రచారం

Advertisement
 
Advertisement