సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుంభకోణాలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ అవినీతిలో కూరుకుపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, మహేశ్వర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 19 ప్రశ్నల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కదానికి మాత్రమే సమాధానం ఇచ్చారు. ప్రశ్నలను ఆయన తన పర్సనల్‌గా తీసుకుంటున్నారు. నేను విషయం డీవియేట్ కాకుండా మాట్లాడాను. వ్యక్తిగత విమర్శలు నేను చేయలేదు. నాయకులను తయారు చేసిన చరిత్ర ఉన్న పార్టీ బీజేపీ. ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసి బీజేఎల్పీ నేతగా నన్ను ఎన్నుకున్నారు.
నేను మీలాగా అపాయింట్‌మెంట్ అయిన లీడర్‌ను కాదు. పీసీసీ పదవి మీరు ఎలా తెచ్చుకున్నారో నాకు తెలుసు. పుట్టింటి వ్యవహారం మేనమామకు ఎరుక అన్నట్టు.. ఉత్తమ్ వ్యవహారం నాకు తెలుసు. కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను సీఎం రేవంత్‌ను కలిశాను. మీ సీఎంను మీరే అనుమానిస్తున్నారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు. యూ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రమే స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థమవుతోంది.
బకాయిలు ఉన్న రైస్ మిలర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. డీ-ఫాల్టర్ల పేర్లను బయట పెడతారా?. తరుగుపై మంత్రి ఏనాడైనా క్షేత్ర స్థాయిలో ఎపుడైనా పరిశీలించారా?. కుంభకోణాలు కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్లతో జరిగిన చర్చల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు. మిల్లర్లతో 100 రూపాయల బాండ్ పేపర్‌పై సంతకాలు చేసుకున్న మాట వాస్తవం కాదా!. మిల్లర్లను భయపెట్టి రాయించుకున్న వంద రూపాయల బాండ్ పేపర్ డాక్యుమెంట్‌ను నేను బయట పెడుతున్నాను.
సన్న బియ్యం టెండర్లు క్యాన్సెల్ చేశామని చెప్పారు. ధ్యానం లిఫ్ట్ చేయని మిల్లర్లకు సమయం ఇచ్చినప్పటికీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు. ఎఫ్‌సీఐకి ఒక సంచి కూడా డెలివరీ ఇవ్వలేదు. సివిల్ సప్లై శాఖ అవినీతిలో కూరుకుపోయింది. రేవంత్-ఉత్తమ్ ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే, పర్సనల్‌గా మాట్లాడవద్దని ఉత్తమ్‌కు సూచిస్తున్నాను. అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment