ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్ మూడో సారి ఛాంపియన్స్‌గా నిలవడంలో వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.
కీలకమైన క్వాలిఫయర్-1, ఫైనల్లోనూ అయ్యర్ అదరగొట్టాడు. క్వాలిఫయర్-1లో 52 పరుగులు చేసిన అయ్యర్.. ఫైనల్లో 52 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఓవరాల్‌గా 13 ఇన్నింగ్స్‌లో వెంకటేష్ అయ్యర్.. 46.25 సగటుతో 370 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ అయ్యర్‌పై భారత మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
గత సీజన్‌తో పోలిస్తే అయ్యర్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్నాడని సునీల్ గవాస్కర్ కొనియాడాడు. ఈ ఏడాది సీజన్‌లో వెంకటేష్ అయ్యర్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
"గత సీజన్‌తో పోలిస్తే అతడి బ్యాటింగ్ స్టైల్‌లో మార్పు కన్పించింది. అతడు ఆలోచించి సరైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయ్యర్ బౌలింగ్ కూడా చేయడం మొదలు పెడితే, మరోసారి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడొక మంచి ఫీల్డర్ కూడా.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు ఇటువంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం. అతడికి బౌలింగ్ చేసే కూడా సత్తా ఉంది. కాబట్టి అతడు కొంచెం కష్టపడితే మళ్లీ భారత జెర్సీ ధరించవచ్చు. భారత తరపున అరంగేట్రం చేసిన తర్వాత అయ్యర్‌లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కన్పించింది.
అందుకే జట్టులో అతడి స్ధానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్(2023)లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసినప్పటికి.. మిగితా మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. అతడు క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించి తన వికెట్‌ను సమర్పించుకునేవాడు.
కానీ ఇప్పుడు అతడి మైండ్ సెట్ మారింది అంటూ" స్టార్ స్పోర్ట్స్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా 2022లో భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన అయ్యర్.. తనకు ఇచ్చి అవకాశాలను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. వరుసగా విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment